PC: bcci
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 26 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్‌జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.
122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు.
కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.
చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు


