708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్‌.. తెలివిలేదా? | East Zone 708 Runs: South Zone 336 Duleep Trophy, Final Rule Explained | Sakshi
Sakshi News home page

708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్‌.. గెలుపు ఖాయం!

Sep 9 2026 12:25 PM | Updated on Sep 9 2026 1:41 PM

East Zone 708 Runs: South Zone 336 Duleep Trophy, Final Rule Explained

ఇషాన్‌ కిషన్‌ (PC: BCCI Domestic X)

దులిప్‌ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సౌత్‌ జోన్‌తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ పోరులో.. ఇషాన్‌ కిషన్‌ సేన సమిష్టిగా రాణించింది.

ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ (72), వైభవ్‌ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్‌ కుమార్‌ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.

270 పరుగులు
ఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్‌ కిషన్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్‌కు తోడుగా కుమార్‌ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.

708 పరుగులు చేసి ఆలౌట్‌
మిగిలిన వారిలో అనుకూల్‌ రాయ్‌ (45) ఎండీ కౌనేన్‌ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్‌ మహ్మద్‌ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఈస్ట్‌ జోన్‌ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌ జోన్‌ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

తెలివిలేదా?.. 
నిజానికి రెడ్‌బాల్‌ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్‌ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్‌ కిషన్‌ మాత్రం జట్టు ఆలౌట్‌ అయ్యేంత వరకు బ్యాటింగ్‌ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.

నిబంధనల ప్రకారమే తెలివిగా
నిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్‌ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్‌ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్‌ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్‌ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) రెడ్‌బాల్‌ క్రికెట్‌ నిబంధనల ప్రకారం..

రంజీ ట్రోఫీ, దులిప్‌ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్‌ మ్యాచ్‌ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్‌ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.

336 పరుగులకే ఆలౌట్‌.. ఈస్ట్‌ జోన్‌ గెలుపు లాంఛనమే
ఇక సౌత్‌ జోన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్‌ వర్మ కెప్టెన్సీలోని సౌత్‌ జోన్‌ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

ఫలితంగా ఈస్ట్‌ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్‌ జోన్‌ ఫాలో ఆన్‌ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్‌ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్‌ జోన్‌ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.

చదవండి: టీమిండియా సెమీస్‌ ప్రత్యర్థి ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement