‘పోరాటం కొనసాగిస్తా’ | Mohammed Shami played a key role in East Zone team winning the Duleep Trophy | Sakshi
Sakshi News home page

‘పోరాటం కొనసాగిస్తా’

Sep 11 2026 1:17 AM | Updated on Sep 11 2026 1:17 AM

Mohammed Shami played a key role in East Zone team winning the Duleep Trophy

మరింత శ్రమించేందుకు సిద్ధం 

నాకు నేనే స్ఫూర్తిగా ఆడుతున్నా

పేసర్‌ మొహమ్మద్‌ షమీ మనోగతం  

చెన్నై: భారత సీనియర్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ తన పోరాటాన్ని వదలడం లేదు. దేశవాళీ క్రికెట్‌లో తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్ని ఫార్మాట్‌లు ఆడుతూ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో పాటు తన ఫిట్‌నెస్‌ను కూడా చూపిస్తున్నాడు. తాజాగా ఈస్ట్‌ జోన్‌ జట్టు దులీప్‌ ట్రోఫీ గెలుచుకోవడంలో షమీ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికిప్పుడు ఆట నుంచి తప్పుకునే ఉద్దేశం అతనిలో కనిపించడం లేదు. 

ఎన్నో రకాలుగా తాను ప్రేరణ పొందుతున్నానని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో మెరుగైన ప్రదర్శనపై గురి పెట్టినట్లు షమీ చెప్పాడు. ‘కెరీర్‌లో నేను ప్రస్తుతం ఉన్న దశలో నాకు నేనే స్ఫూర్తిని పొందడం ఎంతో అవసరం. నేను ఆటపై మరింత దృష్టి పెట్టే దిశగా ప్రేరణ పొందేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా చేయకుంటే మన ఆలోచనా ధోరణిదే తప్పు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఆడుతున్నా సరే, మన దృష్టి, లక్ష్యం అంతా మరింత పైస్థాయికి చేరడం గురించే ఉండాలి’ అని షమీ వ్యాఖ్యానించాడు.  

స్థాయి ఏదైనా ఒకటే... 
గత గురువారమే తన 36వ పుట్టిన రోజు జరుపుకున్న షమీ... ఏ స్థాయిలోనైనా కష్టపడేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. ‘క్రికెట్‌లో ఒక టీమ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైన తర్వాత అది ఏ స్థాయి అనేది అనవసరం. బాగా ఆడాలనే కసి, పోరాడేతత్వం సహజంగానే వస్తాయి. మానసికంగా కూడా నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా. ఏ స్థాయిలో మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు పట్ల నా బాధ్యత నెరవేరుస్తా’ అని అతను చెప్పాడు. 

దులీప్‌ ట్రోఫీలో ఫైనల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనుకూలంగా లేని పిచ్‌పై కూడా ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండటం వల్లే రాణించగలిగానని షమీ పేర్కొన్నాడు. ‘నేను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. బౌన్స్‌ తక్కువగా ఉండే ఇలాంటి పిచ్‌పై సాంప్రదాయ స్వింగ్‌ కూడా పెద్దగా ఫలితం ఇవ్వదు. కాబట్టి లైన్‌ అండ్‌ లెన్త్‌కు కట్టుబడి ఉండటంపైనే దృష్టి పెట్టా. అప్పుడు వికెట్లు తీసేందుకు అవకాశం కలిగింది. పరిస్థితులు అనుకూలంగా లేని చోటనే అసలైన సవాల్‌ ఎదురవుతుంది. ఎంతో శ్రమిస్తే గానీ వికెట్‌ దక్కదు. అలాంటి పక్కా వ్యూహంతోనే రషీద్‌ వికెట్‌ దక్కింది’ అని ఈ పేసర్‌ తన వ్యూహాన్ని వివరించాడు. 

ఈ విజయం ప్రత్యేకం... 
తన 100వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ దులీప్‌ ట్రోఫీ గెలుచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అతను అన్నాడు. ఈ గెలుపు కోసం టీమ్‌లో తనతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఎంతో శ్రమించారని షమీ అభిప్రాయపడ్డాడు. ‘ఈస్ట్‌ జోన్‌ చాలా సంవత్సరాల తర్వాత దులీప్‌ ట్రోఫీ నెగ్గింది. అదీ నా 100వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ కావడం చాలా సంతృప్తినిచ్చింది. నా మొదటి మ్యాచ్‌లో ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా అలాగే కష్టపడ్డా. మేం ఎంత బాగా ఆడామో అంతా చూశారు. జట్టులోని ప్రతీ సభ్యుడు తన వంతు పాత్ర పోషించారు. 

కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వీరంతా ఇప్పటికే ఐపీఎల్‌ తదితర టోర్నీల ద్వారా మంచి అనుభవం గడించారు. ఒత్తిడి లేకుండా పరిణతితో ఆడుతున్నారు. ముఖ్యంగా వైభవ్‌లో తన వయసుకు తగిన అమాయకత్వం ఉండటమే కాదు, తొందరగా నేర్చుకోవాలనే తపన కూడా కనిపిస్తోంది. నా కెరీర్‌ ఎంత ఉందో నీ వయసు అంతే ఉంది అంటూ అతడితో సరదాగా మాట్లాడేవాడిని’ అని షమీ తన అనుభవాన్ని వివరించాడు. 

నాకు తెలిసింది ఆట మాత్రమే... 
టీమిండియా తరఫున మార్చి 2025లో తన చివరి మ్యాచ్‌ ఆడిన షమీ... 2023 తర్వాత టెస్టు క్రికెట్‌లో బరిలోకి దిగలేదు. కెరీర్‌ చివరి దశలో ఉన్న షమీ తనకు ఇటీవల లభిస్తున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై చాలా మంది చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడను. ఇలాంటి మద్దతు లభించడం చాలా బాగుంది. కష్టపడి పని చేయడమే నాకు తెలిసింది. ఆపై అంతా దేవుడి చేతుల్లోనే ఉంది’ అని షమీ వ్యాఖ్యానించాడు. సుమారు 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 197  మ్యాచ్‌లు ఆడిన షమీ మొత్తం 462 వికెట్లు పడగొట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement