breaking news
East Zone team
-
‘పోరాటం కొనసాగిస్తా’
చెన్నై: భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తన పోరాటాన్ని వదలడం లేదు. దేశవాళీ క్రికెట్లో తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడుతూ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో పాటు తన ఫిట్నెస్ను కూడా చూపిస్తున్నాడు. తాజాగా ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ గెలుచుకోవడంలో షమీ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికిప్పుడు ఆట నుంచి తప్పుకునే ఉద్దేశం అతనిలో కనిపించడం లేదు. ఎన్నో రకాలుగా తాను ప్రేరణ పొందుతున్నానని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో మెరుగైన ప్రదర్శనపై గురి పెట్టినట్లు షమీ చెప్పాడు. ‘కెరీర్లో నేను ప్రస్తుతం ఉన్న దశలో నాకు నేనే స్ఫూర్తిని పొందడం ఎంతో అవసరం. నేను ఆటపై మరింత దృష్టి పెట్టే దిశగా ప్రేరణ పొందేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా చేయకుంటే మన ఆలోచనా ధోరణిదే తప్పు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఆడుతున్నా సరే, మన దృష్టి, లక్ష్యం అంతా మరింత పైస్థాయికి చేరడం గురించే ఉండాలి’ అని షమీ వ్యాఖ్యానించాడు. స్థాయి ఏదైనా ఒకటే... గత గురువారమే తన 36వ పుట్టిన రోజు జరుపుకున్న షమీ... ఏ స్థాయిలోనైనా కష్టపడేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. ‘క్రికెట్లో ఒక టీమ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైన తర్వాత అది ఏ స్థాయి అనేది అనవసరం. బాగా ఆడాలనే కసి, పోరాడేతత్వం సహజంగానే వస్తాయి. మానసికంగా కూడా నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా. ఏ స్థాయిలో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు పట్ల నా బాధ్యత నెరవేరుస్తా’ అని అతను చెప్పాడు. దులీప్ ట్రోఫీలో ఫైనల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనుకూలంగా లేని పిచ్‌పై కూడా ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండటం వల్లే రాణించగలిగానని షమీ పేర్కొన్నాడు. ‘నేను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. బౌన్స్ తక్కువగా ఉండే ఇలాంటి పిచ్‌పై సాంప్రదాయ స్వింగ్ కూడా పెద్దగా ఫలితం ఇవ్వదు. కాబట్టి లైన్ అండ్ లెన్త్కు కట్టుబడి ఉండటంపైనే దృష్టి పెట్టా. అప్పుడు వికెట్లు తీసేందుకు అవకాశం కలిగింది. పరిస్థితులు అనుకూలంగా లేని చోటనే అసలైన సవాల్ ఎదురవుతుంది. ఎంతో శ్రమిస్తే గానీ వికెట్ దక్కదు. అలాంటి పక్కా వ్యూహంతోనే రషీద్ వికెట్ దక్కింది’ అని ఈ పేసర్ తన వ్యూహాన్ని వివరించాడు. ఈ విజయం ప్రత్యేకం... తన 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ గెలుచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అతను అన్నాడు. ఈ గెలుపు కోసం టీమ్‌లో తనతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఎంతో శ్రమించారని షమీ అభిప్రాయపడ్డాడు. ‘ఈస్ట్ జోన్ చాలా సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీ నెగ్గింది. అదీ నా 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం చాలా సంతృప్తినిచ్చింది. నా మొదటి మ్యాచ్‌లో ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా అలాగే కష్టపడ్డా. మేం ఎంత బాగా ఆడామో అంతా చూశారు. జట్టులోని ప్రతీ సభ్యుడు తన వంతు పాత్ర పోషించారు. కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వీరంతా ఇప్పటికే ఐపీఎల్ తదితర టోర్నీల ద్వారా మంచి అనుభవం గడించారు. ఒత్తిడి లేకుండా పరిణతితో ఆడుతున్నారు. ముఖ్యంగా వైభవ్‌లో తన వయసుకు తగిన అమాయకత్వం ఉండటమే కాదు, తొందరగా నేర్చుకోవాలనే తపన కూడా కనిపిస్తోంది. నా కెరీర్ ఎంత ఉందో నీ వయసు అంతే ఉంది అంటూ అతడితో సరదాగా మాట్లాడేవాడిని’ అని షమీ తన అనుభవాన్ని వివరించాడు. నాకు తెలిసింది ఆట మాత్రమే... టీమిండియా తరఫున మార్చి 2025లో తన చివరి మ్యాచ్ ఆడిన షమీ... 2023 తర్వాత టెస్టు క్రికెట్లో బరిలోకి దిగలేదు. కెరీర్ చివరి దశలో ఉన్న షమీ తనకు ఇటీవల లభిస్తున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై చాలా మంది చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడను. ఇలాంటి మద్దతు లభించడం చాలా బాగుంది. కష్టపడి పని చేయడమే నాకు తెలిసింది. ఆపై అంతా దేవుడి చేతుల్లోనే ఉంది’ అని షమీ వ్యాఖ్యానించాడు. సుమారు 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 197 మ్యాచ్‌లు ఆడిన షమీ మొత్తం 462 వికెట్లు పడగొట్టాడు. -
దేవధర్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్
ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు కైవసం చేసుకుంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో ఈస్ట్ 24 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలిచింది. 1973-74 సీజన్లో మొదలైన దేవధర్ ట్రోఫీని ఈస్ట్‌జోన్ జట్టు నెగ్గడం ఇది ఐదోసారి. చివరిసారి ఈస్ట్ జట్టు 2003-04 సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ మనోజ్ తివారీ (92 బంతుల్లో 75; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామంత్రి (50 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ సింగ్ (84 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ధావల్, జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటయింది. 37 పరుగులకే అంబటి తిరుపతి రాయుడు సహా మూడు వికెట్లు కోల్పోయిన వెస్ట్‌ను... కేదార్ జాదవ్ (91 బంతుల్లో 97; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే చివరి ఓవర్లలో ఈస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ చేజారకుండా చూసుకున్నారు. అశోక్ దిండా నాలుగు వికెట్లు తీశాడు. -
ఫైనల్లో ఈస్ట్‌జోన్
- మనోజ్ తివారీ సెంచరీ - సెమీస్‌లో నార్త్పై గెలుపు - దేవధర్ ట్రోఫీ ముంబై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఈస్ట్‌జోన్ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ మనోజ్ తివారీ (121 బంతుల్లో 151; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్ 52 పరుగుల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. తివారీ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. నార్త్ జోన్ బౌలర్లలో సందీప్ శర్మ 3, రిషీ ధావన్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన నార్త్‌జోన్ 47.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గురుకీరత్ సింగ్ (99 బంతుల్లో 83; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. మన్దీప్ సింగ్ (40), రిషీ ధావన్ (38) రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. యువరాజ్ సింగ్ (4) మరోసారి నిరాశపర్చాడు. లాహిరి 3, దిండా, సామంత్రే చెరో రెండు వికెట్లు తీశారు. సౌత్, వెస్ట్‌జోన్‌ల మధ్య రెండో సెమీస్ ముంబైలో నేడు జరగనుంది.


