Womens Asia Cup 2026: షఫాలీ మెరుపులతో ఫైనల్‌కు భారత్‌ | India into Womens Asia Cup final | Sakshi
Sakshi News home page

Womens Asia Cup 2026: షఫాలీ మెరుపులతో ఫైనల్‌కు భారత్‌

Sep 10 2026 11:30 PM | Updated on Sep 11 2026 1:26 AM

India into Womens Asia Cup final

తొలి సెమీఫైనల్లో టీమిండియా ఘన విజయం

40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఓటమి 

ఆసియా కప్‌ మహిళల టి20 టోర్నీ 

నేడు రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో శ్రీలంక ‘ఢీ’

రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత జట్టు అజేయ ప్రదర్శన కొనసాగింది. లీగ్‌ దశలో ఎదురులేకుండా సాగిన టీమ్‌ సెమీఫైనల్లోనూ మరో బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించింది.

అనంతరం బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. షోర్నా (22 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, దీప్తి శర్మ 3, నందని 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో 50 వికెట్లు (29 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకుంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ బృందం ఆడుతుంది. 

నాలుగు లైఫ్‌లు... 
స్మృతి మంధాన (2) తొందరగానే వెనుదిరిగినా, షఫాలీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టింది. సుల్తానా ఓవర్లో వరుసగా ఆమె రెండు సిక్స్‌లు కొట్టగా, పవర్‌ప్లేలో స్కోరు 45 కు చేరింది. నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన షఫాలీ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సుల్తానా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన షఫాలీ తర్వాతి బంతికి వెనుదిరిగింది. 

షఫాలీ వర్మకు ఏకంగా 4 లైఫ్‌లు లభించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆమె స్కోరు 6, 11, 56 వద్ద సులువైన క్యాచ్‌లు వదిలేసిన బంగ్లా ఫీల్డర్లు... 50 వద్ద కూడా సులువైన రనౌట్‌ అవకాశాన్ని చేజార్చారు.  ఛేదనలో ఏ దశలోనూ బంగ్లాదేశ్‌ లక్ష్యం దిశగా సాగలేదు. తొమ్మిది పరుగుల వ్యవధిలో తొలి రెండు వికెట్లు కోల్పోయిన జట్టు... కొంత విరామం తర్వాత 17 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లు చేజార్చుకొని కోలుకోలేకపోయింది.

10 ఆసియా కప్‌ చరిత్రలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం. 2004 నుంచి 2008 వరకు వన్డే ఫార్మాట్‌లో నాలుగుసార్లు ఆసియా కప్‌ జరగ్గా నాలుగుసార్లూ భారత జట్టే విజేతగా నిలిచింది. 2012 నుంచి 2024 వరకు టి20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ నిర్వహించారు. భారత జట్టు మూడుసార్లు (2012, 2016, 2022) టైటిల్‌ నెగ్గి, రెండుసార్లు (2018, 2024) రన్నరప్‌గా నిలిచింది.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) షోర్నా (బి) సుల్తానా 2; షఫాలీ (సి) (సబ్‌) ఫర్జానా (బి) సుల్తానా 64; ప్రతీక (సి) దిలారా (బి) రాబియా 20; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 24; రిచా (స్టంప్డ్‌) నిగార్‌ (బి) నాహిదా 21; దీప్తి (సి) రాబియా (బి) మారుఫా 13; భారతి (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149.  వికెట్ల పతనం: 1–9, 2–59, 3–92, 4–128, 5–149, 6–149. బౌలింగ్‌: మారుఫా 4–0–40–1, సుల్తానా 3–0–30–2, నాహిదా 4–0–25–1, రాబియా 4–0–22–1, ఫహీమా 4–0–21–0, షోర్నా 1–0–10–0. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: దిలారా (సి) క్రాంతి (బి) దీప్తి 21; జువేరియా (సి) రిచా (బి) శ్రీచరణి 14; శోభన (బి) దీప్తి 18; నిగార్‌ (సి) నందని (బి) ప్రేమ 19; షోర్నా (నాటౌట్‌) 22; షర్మీన్‌ (బి) దీప్తి 1; ఫహీమా (సి) ప్రేమ (బి) నందని 14; రాబియా (హిట్‌వికెట్‌) (బి) నందని 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–26, 2–35, 3–66, 4–76, 5–83, 6–109, 7–109. బౌలింగ్‌: క్రాంతి 2–0–13–0, నందని 2–0–10–2, శ్రీచరణి 4–1–14–1, షఫాలీ 4–0–25–0, ప్రేమ 4–0–21–1, దీప్తి 4–0–26–3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement