పడిక్కల్‌ ఎంట్రీ.. ఆంధ్ర ప్లేయర్‌పై వేటు | Tilak Varma Confirms Padikkal At No3 Siraj In Duleep Trophy Final | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరి రాకతో మా జట్టు మరింత బలపడింది: తిలక్‌ వర్మ

Sep 5 2026 5:14 PM | Updated on Sep 5 2026 5:34 PM

Tilak Varma Confirms Padikkal At No3 Siraj In Duleep Trophy Final

టీమిండియాతో సిరాజ్‌ (PC: BCCI X)

దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌ బాల్‌ టోర్నమెంట్‌ దులిప్‌ ట్రోఫీ-2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఈస్ట్‌ జోన్‌- సౌత్‌ జోన్‌ టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో సౌత్‌ జోన్‌ జట్టుకు శుభవార్త అందింది.

టీమిండియా  స్టార్లు మహ్మద్‌ సిరాజ్‌, దేవదత్‌ పడిక్కల్‌ జట్టుతో చేరారు. సౌత్‌ జోన్‌ కెప్టెన్‌, టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ శనివారం ధ్రువీకరించాడు. పడిక్కల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు విలేకరులతో మాట్లాడుతూ..

మరింత పటిష్టంగా
‘‘పడిక్కల్‌ రాకతో మా బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టంగా మారింది. గత రెండు, మూడు మ్యాచ్‌లలో అతడు అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. నిజంగా అతడు రావడం మా జట్టుకు అదనపు బలం. ఇక సిరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మా బౌలింగ్‌ విభాగానికి సిరాజ్‌ బలంగా మారాడు. తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకున్నాడు. మా జట్టులోని కొంత మంది జూనియర్‌ ఆటగాళ్లకు ఇదొక అదనపు ప్రయోజనం.

ఓపెనర్లుగా వాళ్లే
ఇక ఇంతకుముందు రికీ భుయ్‌ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే, అతడు మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు జగ్గీ (జగదీశ్‌ నారాయణన్‌)తో కలిసి మరోసారి ఓపెనింగ్‌ చేస్తాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా సీనియర్‌ ప్లేయర్‌ రికీ భుయ్‌ సేవలు వాడుకుంటున్నాము’’ అని తిలక్‌ వర్మ తెలిపాడు.

నో రాహుల్‌
కాగా పడిక్కల్‌ వన్‌డౌన్‌లో ఆడుతుండటంతో.. ఆంధ్ర ప్లేయర్‌ షేక్‌ రషీద్‌పై వేటు పడింది. కీలక సెమీస్‌ మ్యాచ్‌లో అతడు (0,1) పూర్తిగా విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. పడిక్కల్‌, సిరాజ్‌లతో పాటు టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా సౌత్‌ జోన్‌ తరఫున దులిప్‌ ట్రోఫీ ఫైనల్లో ఆడతాడనే ప్రచారం జరిగింది. అయితే, తిలక్‌ వర్మ మాత్రం జగ్జీ- రికీ భుయ్‌ ఓపెనర్లుగా వస్తారని.. పరోక్షంగా ఈ ప్రచారాన్ని ఖండించాడు.

ఇదిలా ఉంటే.. టీమిండియా ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుంది. ఈ టూర్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్‌ 1-0తో గెలిచింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సిరాజ్‌ లంకతో టెస్టు సిరీస్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: ‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీని ఎవరూ ఆపలేరు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement