PC: Instagram
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. లేడీ సూపర్‌స్టాన్ నయనతారకు ధన్యవాదాలు తెలిపింది. చెన్నైలో తమకు మరో కుటుంబం దొరికిందంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సింధు, ఆమె భర్త వెంకట దత్తసాయికి నయనతార- విఘ్నేశ్ గణేశన్ దంపతులు తమ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చారు.
అందమైన సాయంత్రం
ఈ సందర్భంగా నయనతార దంపతులతో దిగిన ఫొటోలను సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘అందమైన సాయంత్రం. అద్భుతమైన, రుచికరమైన భోజనం. మనస్పూర్తిగా సాగిన సంభాషణలు.. సంతోషాలు..
కొన్నిసార్లు డిన్నర్లు కూడా ఎదుటి వ్యక్తి పట్ల మన దృక్కోణాన్ని మార్చివేస్తూ ఉంటాయి. ఎదుటివాళ్లను మరింత లోతుగా అర్థం చేసుకునే వీలు కల్పిస్తాయి. స్నేహితులుగా మనం అడుగుపెట్టి.. జీవితం, ప్రేమ.. ప్రతీ ఒక్క విషయం గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకువెళ్తాయి.
మనం ఒకరికొకరం ఎన్నో ఏళ్లుగా తెలుసు.. కలకాలం ఇలాగే కలిసి ఉంటామనే అనుభూతిని పంచుతాయి. ఇప్పటి వరకు చెన్నై అంటే మా ఆర్తి సెంథిల్ కుమార్ ఆంటీ ఒక్కరే గుర్తుకువచ్చేవారు.
మాకు మరో కుటుంబం
ఇప్పుడు ఇక్కడ మా కోసం ఇంకో కుటుంబం కూడా ఉందనే భావన కలిగింది. విక్కీ, నయన్ మీరు మా మనసులు దోచేశారు’’ అంటూ సింధు భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ఇందుకు విఘ్నేశ్ శివన్, నయనతార స్పందించారు. ‘‘మీరిద్దరు కూడా ఎంతో స్వీట్.. మీపై మా ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది’’ అని సింధుకు బదులిచ్చారు.
కాగా నయనతార ఇటీవల హాయ్ సినిమాతో వెండితెరపై సందడి చేయగా.. సింధు ఇటీవల బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రీక్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.


