మహిళల ఆసియా కప్-2026లో అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
మంధాన మరో 78 పరుగులు సాధిస్తే, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ (4,758 పరుగులు) పేరిట ఉంది. మంధాన ఇప్పటివరకు 167 మ్యాచ్‌లలో 30.79 సగటుతో 4,681 పరుగులు చేసింది.
ప్రస్తుత టోర్నీలో మంధాన దుమ్ములేపుతోంది. దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో సత్తా చాటిన ఆమె, కేవలం రెండు మ్యాచ్‌లలోనే 143 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఉన్న జోరు చూస్తుంటే బేట్స్ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అదే ఫామ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా కొనసాగించాలని స్మృతి ఉవ్విళ్లూరుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టు కూడా పాక్‌ను చిత్తు చేసి తమ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. పాకిస్తాన్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాది జట్టుకు టీమిండియా చేతిలో ఓటమి ఖాయమనే చెప్పాలి.
మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే
సుజీ బేట్స్: 4758
స్మృతి మంధాన: 4681
హర్మన్‌ప్రీత్ కౌర్: 4231
చమరి అతపత్తు: 4094
సోఫీ డివైన్: 3817


