'యానిమల్' సినిమాలో విలన్‌గా అదరగొట్టిన బాబీ డియోల్.. చాన్నాళ్ల తర్వాత తనకొచ్చిన క్రేజ్‌తో హీరోగానూ మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన లేటెస్ట్ హిందీ చిత్రం 'బందర్'. జూన్ తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. రీసెంట్‌గా జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ రియలస్టిక్ క్రైమ్ డ్రామా ఎలా ఉంది? ఇంతకీ చూడొచ్చా లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ)
కథేంటి?
సమర్ మెహ్రా(బాబీ డియోల్) ఒకప్పుడు స్టార్ హీరో. కానీ ఇప్పుడు వయసైపోవడంతో ఎవరూ అవకాశాలివ్వరు. దీంతో తానే హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఖుషి(షబా ఆజాద్)తో కలిసి లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటాడు. ఓ రోజు రాత్రి సమర్ తన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇతడి మాజీ ప్రియురాలు గాయత్రి(సప్న పబ్బీ) ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 376 నమోదు చేసి అత్యాచార కేసు పెడతారు. ఇంతకీ గాయత్రి ఎవరు? సమర్‌కి ఈమెతో ఎలా పరిచయం? సమర్ నిజంగానే ఆమెని బలత్కారం చేశాడా? లేదంటే సమర్‌ని కావాలనే తప్పుడు కేసులో ఇరికించారా? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'తప్పుడు అత్యాచారం కేసులో చాలా ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు' లాంటి వార్తలు గతంలో మీరు చూసే ఉంటారుగా. ఈ సినిమా అలాంటి ఓ కథతోనే తీశారు. సమర్ అనే ఒకప్పటి హీరో.. గాయత్రి అనే అమ్మాయిని డేటింగ్ యాప్ ద్వారా కలుస్తాడు. తర్వాత వీళ్లిద్దరూ హద్దులు దాటేసి శారీరకంగానూ ఒక్కటవుతారు. కానీ కొన్ని పరిస్థితులు వీళ్ల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆమె అసూయ కారణంగా ఊహించని సంఘటనలు జరుగుతాయి. దీంతో 'బందర్'లా అంటే బోనులో ఉంచిన కోతిలా హీరో పరిస్థితి తయారవుతుంది.
సినిమా ఎలా ఉంది అని అడిగితే డిఫరెంట్‌గా బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లా ఉండదు. కాబట్టి ఎంతమందికి నచ్చుతుందని చెప్పలేం. బూతులు, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వాంతి వచ్చేలా అనిపిస్తుంది. లగ్జరీ లైఫ్ అనుభవించే ఓ నటుడు అనుకోకుండా జైలులో దారుణమైన పరిస్థితుల్లో బతకాల్సి వస్తే అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది? లాంటి అంశాల్ని రా అండ్ రస్టిక్‌గా చూపించారు. ఈ సీన్స్ చూసిన తర్వాత పొరపాటున కూడా జైలుకి వెళ్లకూడదు బాబోయ్ అనిపించకమానదు.
అత్యాచార కేసు, కోర్ట్ ప్రొసీడింగ్స్ లాంటివి ఈ కథలో ఉంటాయి గానీ వాటిని పైపైనే చూపించారు. సమర్ గడిపిన దుర్భరమైన జైలు జీవితాన్ని వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేశారు. అసలు జైలులో ఓ అండర్ ట్రయల్ ఖైదీని పోలీసుల దగ్గర నుంచి మిగతా ఖైదీల వరకు ఎలా ట్రీట్ చేస్తారు? మరీ ముఖ్యంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయితే మిగతా ఖైదీలు వీళ్లని ఎలా వేధిస్తారు? జైలులో ప్రతి చిన్న విషయానికి లంచాలు తీసుకుని పోలీసులు ఎలా సాయం చేస్తారు? లాంటి సీన్స్ అయితే ఆలోచనలో పడేస్తాయి.
ఇంకొన్ని సన్నివేశాలైతే జుగుప్సకరంగా కడుపులో తిప్పేసినట్లు అనిపిస్తాయి. ఓ రోజు సమర్ నిద్రపోతుంటాడు. ఏదో అలికిడి కావడంతో లేచి చూస్తే ఇద్దరు మగాళ్లు ఓ పక్కకు వెళ్లి శృంగారం చేసుకుంటూ ఉంటారు. ఇది చూసినప్పుడు.. వామ్మో జైలు జీవితంలో ఇలాంటి ఘోరాలు కూడా ఉంటాయా అని సందేహం కలుగుతుంది. అయితే ఈ మూవీ అంతా కూడా ఏదో ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీసినట్లు అనిపిస్తుంది తప్పితే రెగ్యులర్ ఆడియెన్స్ కోసమైతే తీయలేదని డౌట్ వస్తుంది.

ఎవరెలా చేశారు?
సమర్ మెహ్రాగా బాబీ డియోల్ అదరగొట్టేశాడు. ఎక్కడా బాబీ కనిపించడు. సదరు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. 'సలార్', 'వారణాసి' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్.. ఇందులో లిజో అనే ఖైదీగా నటించాడు. ఇద్దరు పురుషుల శృంగారం సీన్‌లోని ఒక పాత్రధారి ఇతడే. అసలు ఈ సన్నివేశాన్ని ఇతడెలా ఒప్పుకొన్నాడా అనిపిస్తుంది. సమర్ చెల్లెలు సుహానాగా సన్యా మల్హోత్రా, ఎక్స్ లవర్, బాధితురాలు గాయత్రిగా సప్నా పబ్బీ, ప్రియురాలు ఖుషీగా షబా ఆజాద్ డీసెంట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రాజ్ బి శెట్టి కూడా ఇందులో ఓ ఖైదీగా చేశాడు. కానీ గంజాయి తాగడం తప్పితే చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. మిగిలిన వాళ్లు ఓకే ఓకే.
టెక్నికల్ విషయాలకొస్తే జైలు సెట్టింగ్, సినిమాటోగ్రఫీ స్టోరీ మూడ్‌కి తగ్గట్లు ఉన్నాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎప్పటిలానే ఓ భిన్నమైన కథని అంతే డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశాడు. అయితే సమర్ ఒక బాధితుడా లేదా తన అహంకారానికి శిక్ష అనుభవిస్తున్నాడా అనే సందేహం చివరివరకు అలాగే ఉంటుంది. క్లైమాక్స్‌లోనూ సరైన ముగింపు ఏం ఇవ్వకుండా వదిలేశారు. ఓవరాల్‌గా అయితే బాగుందీ మూవీ. హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
- చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్
(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)


