అప్పుడప్పుడు ఓటీటీలో నేరుగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. అలా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి 'ప్యార్ ప్రేమ కళ్యాణం' వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కథతో తీశారు. తమిళ కుర్రాడు ఎలన్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్‌గా చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
దుబాయిలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేసే ఎలన్(ఎలన్) ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి తనకు తానుగానే ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవిత్ర అలియాస్ పర్పుల్ పవి(శాన్వి మేఘన)తో ప్రేమలో పడతాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పవి సొంతింటిని వదిలేసి రానని పట్టుబడుతుంది. దీంతో ఎలన్.. ఇల్లరికపు అల్లుడిగా అత్తారింట్లో అడుగుపెడతాడు. తర్వాత ఇతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'ప్యార్ ప్రేమ కళ్యాణం'.. టైటిల్‌కి తగ్గట్లే ప్రేమ, పెళ్లి బంధంలోని ప్లస్ మైనస్సుల గురించి ఇందులో చూపించారు. మరి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఓకే అంతే. చెబుదామనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన తమిళ అతి ప్రతి సీన్‌లోనూ కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ పాత్ర తప్పితే ప్రతి ఒక్కరూ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంటారు. ఇదంతా కామెడీ అనుకుని దర్శకుడు అనుకున్నాడు. కానీ కుదరలేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు.
సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అల్లుడు, అత్తారింటికి(ఇల్లరికం) వస్తాడు. ఈ సినిమాలో అలానే ఉద్యోగం లేని హీరో.. ఇల్లరికపు అల్లుడిలా వెళ్తాడు. ప్రారంభంలో మర్యాదలు ఓ రేంజులో ఉంటాయి. కానీ రానురాను మురిపెం తగ్గిపోయి అత్త అసలు రంగు బయటపడుతుంది. అప్పటినుంచి అల్లుడికి బ్యాండ్ బాజా బరాత్ మొదలవుతుంది. దీంతో కష్టాలు పడతాడు. ఈ పార్ట్ అంతా కూడా ఓకే ఓకే అనేలా ఉంటుంది. టైమ్ పాస్ అయిపోతుంది.
చాలామంది గృహిణులు.. భర్త బయటకెళ్లి ఉద్యోగం చేస్తూంటే ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇదే రివర్స్‌లో జరుగుతుంది. ఓ సందర్భంలో హీరోకి జాబ్ వస్తే ఆ సంగతి హీరోయిన్‌కి చెబుతాడు. ఆమె ఏమో.. నువ్వు బయటకెళ్లి పనిచేయడం ఎందుకు, ఇంట్లో కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నావ్‌గా, పైగా జీతం కూడా తక్కువే అని అతడిని నిరుత్సాహపరుస్తుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏళ్లకేళ్లుగా చాలామంది భర్తలు.. ఉద్యోగం చేయాలనుకునే భార్యలకు ఇలానే చెబుతుంటారు కదా అనిపించింది. చాలామంది గృహిణులు ఇలా భర్తలు చెప్పే మాటల వల్ల ఎంతలా నిరుత్సాహపడుతున్నారనేది బాగా చూపించారు.
అలానే ఫెమినిస్ట్ అని చెప్పుకొనే హీరోయిన్.. తాను సొంతింటిని, తల్లిదండ్రులని వదిలిరానని చెప్పి భర్తని తన ఇంటికి ఇల్లరికం రప్పించుకుంటుంది. తర్వాత ఈ విషయంలో ఆమె రియలైజ్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిని బాగానే తీశారు. ఫస్టాప్‌లో హీరో, అతడి అత్త, భార్య మధ్యలో వచ్చే హంగామా, సెకండాఫ్‌లో హీరో తల్లి చేసే దొంగపనులు వల్ల హీరోయిన్ జాబ్ కోల్పోవడం లాంటివి పర్లేదనిపించాయి. క్లైమాక్స్ అయితే నిజంగా ఎక్కడైనా అలా జరుగుతుందా అని డౌట్ వస్తుంది. అదంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది.

యాక్టింగ్ విషయానికొస్తే.. పవిత్రగా శాన్వి మేఘన పాత్రకు తగ్గట్లు చేసింది. హీరో కమ్ దర్శకుడు ఎలన్ కూడా బాగానే చేశాడు. కాకపోతే తన తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనో ఏమో గానీ మొత్తం అతితో నింపేశాడు. రాధిక, యోగిబాబు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్లకు సరైన సీన్స్ పడలేదు. మిగతా నటీనటులు ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉన్నప్పటికీ మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. నిడివి రెండు గంటలే కావడం కాస్త రిలీఫ్. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదో యావరేజ్ సినిమా. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.
- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్


