ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ | Aakali Rajyam 2026 Series Review Telugu | Sakshi
Sakshi News home page

Aakali Rajyam 2026 Review: నిరుద్యోగుల వ్యధ.. 'ఆకలిరాజ్యం' ఎలా ఉందంటే?

Aug 28 2026 7:00 PM | Updated on Aug 28 2026 7:36 PM

Aakali Rajyam 2026 Series Review Telugu

1980లో కమల్ హాసన్ హీరోగా 'ఆకలిరాజ్యం' సినిమా వచ్చింది. నిరుద్యోగుల బాధలు, కష్టాల గురించి ఇందులో చూపించిన విధానం ఇప్పటికీ రిలేటబుల్‌గానే ఉంటుంది. ఇదొచ్చి 45 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లేటెస్ట్‌గా 'ఆకలిరాజ్యం 2026' పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. ఆహా ఓటీటీలో ఈ రోజే(ఆగస్టు 28) స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఇదెలా ఉంది? ఇందులో ఎలాంటి కంటెంట్ చూపించారు? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
రమేశ్(వికాస్ వశిష్ఠ), అరుణ(గీతా సైనీ), అక్షయ్(రాజేశ్ ఖన్నా) ఇంజినీరింగ్ చదివేటప్పటి నుంచి స్నేహితులు. హైదరాబాద్‌లో ఒకే గదిలో అద్దెకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరోవైపు సొంతంగా ఏదైనా చేయాలని తాపత్రయపడుతుంటారు. ఓ వైపు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ మరోవైపు వ్యక్తిగతంగానూ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిరాశ, నిస్పృహలతో సాగుతున్న వీళ్ల జీవితం చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఈ సిరీస్‌లో చూపించింది కొత్త కథేం కాదు. నిరుద్యోగ సమస్య అనేది రోజురోజుకీ చాలా పెరుగుతోంది. ఇంజినీరింగ్ పాస్ అయినప్పటికీ ఉద్యోగాలు రాని యువత కోట్లాదిమంది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బతుకీడుస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి ఓ ముగ్గురి జీవితమే ఈ సిరీస్. ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఉన్నంతలో వీటిని బాగానే తీశారు.

ఒక్కో ఎపిసోడ్ సగటుగా 35 నిమిషాల నిడివితో ఉంటుంది. నిరుద్యోగం అనే సీరియస్ అంశాన్ని హాస్యంతో చెప్పే ప్రయత్నం చేశారు. తొలి రెండు ఎపిసోడ్స్ నవ్వించినప్పటికీ మూడో ఎపిసోడ్ మాత్రం ఎమోషనల్ చేస్తుంది. ప్రస్తుత జనరేషన్ కనెక్ట్ అయ్యే అంశాల్ని ఇందులో చూపించిన దర్శకుడు నీలగిరి మామిళ్ల.. సిరీస్ ఆకట్టుకునేలా తీయడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే అవసరమైన కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అక్కడక్కడ వినిపించే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇ‍బ్బంది పెడతాయి.

ఉన్నంతలో హైదరాబాద్‌లోని రియల్ లొకేషన్లలోనే తీశారు. కాకపోతే ఇప్పటికే ఇలాంటి కథల్ని చాలా సినిమాల్లో, యూట్యూబ్ సిరీస్‌ల్లో చూసేశాం. కాబట్టి ఆ విషయంలో అయితే కొత్తగా అనిపించదు. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన మూడు ఎపిసోడ్లు పర్లేదనిపించాయి. వచ్చే వారం స్ట్రీమింగ్ చేయబోయే ఎపిసోడ్లలో స్మార్ట్ ఫార్మింగ్(వ్యవసాయం) గురించి చూపించబోతున్నారు. అంటే పల్లెలో కథంతా ఉండబోతుంది.

ప్రధాన పాత్రధారుల విషయానికొస్తే వికాశ్, రాజేశ్, గీతా ఉన్నంతలో బాగానే చేశారు. స్టోరీ రొటీన్‌గా ఉండటం వల్ల గుర్తుండిపోయే సీన్స్ అయితే వీళ్లకు పడలేదు. కొన్నిచోట్ల కన్వీనియంట్ రైటింగ్ కూడా మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే ఇదో టైంపాస్ సిరీస్. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబ సభ్యులతోనూ కలిసి చూడొచ్చు.

-చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement