రుక్మిణి వసంత్. ఈ బామ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. తన నటనతో, యాక్షన్ సీక్వెన్స్‌లతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఇటీవలే టాక్సిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఇదే మూవీ ఈవెంట్‌లో తన తండ్రిని గుర్తుతెచ్చుకుని ఎమోషనల్ అయింది.
రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 2007లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందారు. అప్పటికి రుక్మిణి వయసు కేవలం పదేళ్లు. ఈవిషయాన్ని టాక్సిక్ ఈవెంట్‌లో రుక్మిణిని పరిచయం చేస్తూ ఆమె తండ్రి ఓ అమరవీరుడని నిర్వాహకులు చెప్పడంతో ఆమెతో పాటు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.
అదే అంకితభావంతో..
‘నాన్న ఎంతో మంచి వ్యక్తి. ఆయన విధి పట్ల ఎంతో అంకితభావంతో ఉండే సైనికుడు కూడా. సైనికులను ఎక్కడికి పంపినా..నాన్నే మందుండేవారు. అదే అంకితభావం నా వ్యక్తిత్వంపై కూడా ఎంతో ప్రభావం చూపింది. ఆయన దేశానికి చూసిన సేవలను గుర్తుచేసుకుంటూ నేను కూడా అదే పనిలో అదే అంకితభావాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తాను’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటక నుంచి తొలి అశోకచక్ర గ్రహీత
2007 జూలై 31న ఉరీ ప్రాంతంలో ఉగ్రవాదులతో కల్నల్ వసంత్ వేణుగోపాల్ పోరాడారు. ఈ ఘటనలో ఆయన వీరమరణం పొందారు. ధైర్యసాహసాలకు ఆయన మరణాంతరం అశోక చక్ర లభించింది. కర్ణాటకకు చెందిన తొలి ఆర్మీ అధికారిగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
అలాంటివారిని ఆదుకునేందుకు ఓ ఫౌండేషన్..
భర్తను కోల్పోయినా తర్వాత కూడా రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ఇద్దరు కుమార్తెల బాధ్యతలను చేపట్టారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘వసంతరత్నం ఫౌండేషన్ ఫర్ ఆర్ట్’ను స్థాపించారు. సైనక కుటుంబాలకు సహాయం అందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నాన్న ఉంటే మద్దతుగా ఉండేవారు..
తన తండ్రి ఉన్న సమయంలో తాను నృత్యంపై ఎక్కువ ఆసక్తి చూపేదానిని అని రుక్మిణి తెలిపారు. ‘ నాన్న మాపై ఎప్పుడూ కఠినంగా ఉండేవారు కాదు. చాలా బాగా చూసుకునేవారు. నేను నటనను కెరీర్‌గా ఎంచుకోవడాన్ని చూసి ఆయన తప్పకుండా సంతోషపడేవారు. ప్రోత్సహించేవారు. అని ఆమె గతంలో చెప్పుకొచ్చారు.
సినిమాల విషయానికి వస్తే..
కాంతార, తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్... యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ సరసన ‘డ్రాగాన్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
ఇదీ చదవండి: జార్జ్‌కుట్టి.. ఈసారి అయినా లొంగిపోవయ్యా..!


