కికు యనమల, కశిశ్ ఖాన్ జంటగా నటించిన మూవీ కికు చిరంజీవి. దీనికి అసలు పేరు చిరంజీవి. కానీ టైటిల్ విషయంలో కొందరు అభ్యంతరాలు తెలియజేయడంతో కికు చిరంజీవిగా మార్చారు. ఈ మూవీకి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఇందులో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్(అయ్యంగార్), వైవా రాఘవ ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం.
అసలు కథేంటంటే..
చిరంజీవి(కికు యనమల) అరకులో ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అందరికీ గుండె ఎడమ సైడ్ ఉంటే ఈయనకు కుడివైపు ఉంటుంది. దానివల్ల ఎక్కువ పరిగెడితే ఊపిరి ఆడదు.. ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రకు వచ్చిన మను(కశిశ్ ఖాన్)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే మనుని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఓ వ్యక్తి తన మనుషులతో చంపేస్తుంటాడు. ఈ విషయం మనుకి కూడా తెలియదు. ఓ సంఘటన తర్వాత మను కూడా చిరంజీవిని ఇష్టపడుతుంది. ఈ విషయం ఆ దుండగులకు తెలిసి చిరంజీవిని చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి తప్పించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు . శోభనం రోజు రాత్రి మనుకి షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు మనును చంపేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? చిరంజీవి గతం ఏంటి? ఈ కథలో ఈశ్వరి రావు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
గుండె ఎడవైపు కాకుండా, కుడివైపు ఉందనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలొచ్చాయి. పాత కాన్సెప్ట్ అయినప్పటికీ కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. చిరంజీవి అంటే మరణం లేనివారు.. చచ్చిబతికిన వారు అని పిలుస్తుంటారు. ఇక్కడ రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది పెద్ద ట్విస్ట్.
ఈ కథ ప్రారంభంలో హీరో, హీరోయిన్ల పాత్రలని పరిచేస్తూ, టూర్ ద్వారా వీరిద్దరిని కలుపుతారు. ఈ క్రమంలోనే హీరోకి బ్రీతింగ్ సమస్య, హార్ట్ సమస్య ఉందని తెలుస్తుంది. అనంతరం ఫారెస్ట్‌లో కొందరు దుండగులు వెంటాడటం, ఈ క్రమంలో పారిపోవడం, చిరుని రక్షించుకునేందుకు ఆమె బ్రీతింగ్ ఇవ్వడం వంటి సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే కథలో అసలేం ఏం జరుగుతుందనేది క్లారిటీ మిస్ అవుతుంది. బీచ్‌లో హీరోకి కత్తిపోట్ల తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుతుంది. హీరో లైఫ్‌లోకి ఈశ్వరీరావు రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. వీరు కలిసిపోవడం, హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అలా చకచకా జరిగిపోతుంది. ఫస్ట్ నైట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్‌కు ముందు బిగ్ ట్విస్ట్ ఉంటుంది.
కుడి వైపు ఉండాల్సిన హార్ట్ ఎడమవైపు కొట్టుకుంటే.. తాను ఫస్ట్ నైట్ చేసింది ఎవరితో అని హీరోయిన్ టెన్షన్ పడటంతో కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు అతను ఎవరు? తన వాడు ఎవరనే ఆమె పడే బాధ, స్ట్రగుల్, టెన్షన్ భయటం ఎంగేజ్ చేస్తాయి. అదే సమయంలో చిరంజీవిలో అనూహ్యమైన మార్పు, సైకోలా ప్రవర్తించడం వంటి సీన్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయి.
సెకండాఫ్ అంతా థ్రిల్లర్‌గా మారిపోతుంది. ఆ తర్వాత అంతకు ముందు ఉన్న ట్విస్ట్‌లు ఒక్కోటి రివీల్ అవుతాయి. చిరంజీవి పాత్రలోని ట్విస్ట్, మాస్క్ మ్యాన్ ఎవరు అనేది? తనికెళ్ల భరణి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఫస్ట్ నైట్‌లో చిరంజీవి ఎలా మారిపోయాడు? అసలు హీరోయిన్ లైఫ్‌లో ఏం జరుగుతుందనేది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ క్లైమాక్స్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది.
ఓవరాల్‌గా చూస్తే మొదటి భాగం స్లోగా ఉంటుంది. సీరియల్‌ని తలపిస్తుంది. సీన్లు వచ్చిపోతుంటాయి కానీ.. అందులో ఎమోషన్, ఫీల్, లవ్ కనిపించదు. రొమాన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. డ్రామా ఓవర్‌గా అనిపిస్తుంది. సహజత్వం మిస్సయింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఒక్కటే కాస్తా చెప్పుకోదగ్గది. సెకండాఫ్‌ని బాగానే డీల్ చేశాడు. ట్విస్ట్‌లు, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ అంశాలు బాగానే రాసుకున్నాడు. ఫన్, రొమాన్స్, యాక్షన్ అంశాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే తడబాటు కనిపించింది.
ఎవరెలా చేశారంటే..
చిరంజీవిగా హీరో కికు యనమల ఫర్వాలేదనిపించాడు. ఫన్నీగా, సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. హీరోగా మొదటి సినిమా అయినా కికు యనమల బాగానే యాక్ట్ చేశాడు. మనుగా కశిశ్ ఖాన్ ఉన్నంతలో తన పాత్రలో మెప్పించింది. ఆమె నటన కొంత అసహజంగా అనిపిస్తుంది. మిగిలిన ఈశ్వరీరావు, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయ చేశారు. సాంకేతికంగా చూస్తే రామకృష్ణ కెమెరా వర్క్ బాగుంది.. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫర్వాలేదు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్తా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి.


