సినీరంగంలో వారి జీవితాలు ఫుల్ కలర్‌పుల్‌గా ఉంటాయని అనుకుంటాం. కానీ అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు కూడా చూస్తేనే అసలు జీవితం గురించి తెలుస్తుంది. వర్క్ లైఫ్ బాగానే ఉన్నా.. పర్సనల్ విషయానికి వచ్చేసరికి అదంతా మారిపోయే అవకాశముంది. అలా బాలీవుడ్ బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ మెప్పించిన నటి కామ్యా పంజాబీ జీవితమే ఇందుకు ఉదాహరణ. హిందీలో పలు సీరియల్స్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకుంది.
అయితే సినిమాల్లో ఆకట్టుకున్న ఈమె.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తన మొదటి భర్తతో తాను పడిన ఇబ్బందులను పంచుకుంది. గృహ హింసతో పాటు మానసిక క్షోభ అనుభవించానని తెలిపింది. గాయాలను మేకప్‌తో దాచుకోవడం అలవాటు చేసుకున్నానని కామ్యా వెల్లడించింది. ఆ టాక్సిక్ బంధం నుంచి బయటపడటానికి పడిన ఇబ్బందిని ఆమె గుర్తుచేసుకున్నారు. మా ఇద్దరి గొడవను కుమార్తె ఆరా చూడటంతో.. ఇకపై అతనితో జీవించలేనని డిసైడ్ అయ్యానని కామ్యా వెల్లడించారు.
కామ్యా పంజాబీ మాట్లాడుతూ..'మేమిద్దరం పెళ్లికి ముందే మేము గొడవపడేవాళ్లం. అతను నాకు సరైనవాడు కాదని నిర్ణయించుకోవాల్సిన స్థాయికి పరిస్థితులు వచ్చాయి. కానీ మాది తొలిప్రేమ కావడంతో ఇతనే సరైన వ్యక్తి అనిపించింది. మా ఇద్దరికీ సెట్ కాదని మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ నేను వారి మాట వినలేదు. పెళ్లి తర్వాత ఆయన నన్ను పని మానేయమన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. నేను నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని పోషించాలని చెప్పా. అప్పుడు అతని ఆలోచనా విధానం ఏమిటో నాకు తెలియదు, కానీ అతను ప్రతి విషయాన్ని అనుమానించేవాడు. అతను ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎత్తలేదు?' అని ప్రశ్నలు వేసేవాడు. ఏంటి సంగతి? ఎవరితో ఉన్నావు? అని కూడా ప్రశ్నలు అడిగేవాడు. బాత్రూంలో నన్ను నేను బంధించుకుని గంటల తరబడి బాధపడ్డా. కొన్నిసార్లు రాత్రంతా ఏడ్చేదాన్ని" అని తన బాధను వ్యక్తం చేసింది.
కాగా.. కామ్యా మొదట వ్యాపారవేత్త బంటీ నేగీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరా అనే కుమార్తె జన్మించారు. దాదాపు 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. 2020లో కామ్యా.. శలభ్ డాంగ్‌ను వివాహం చేసుకున్నారు.


