PC: X
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండగా నిలిచాడు. ఇమ్రాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరాడు. కాగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఇమ్రాన్ ఖాన్ ఒకడన్న సంగతి తెలిసిందే. పాక్‌కు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన కెప్టెన్ ఇమ్రాన్.
మూడేళ్లుగా జైలులోనే
ఆ తర్వాత రాజకీయాల్లో చేరిన ఇమ్రాన్ ఖాన్.. ప్రధాన మంత్రి అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలతో 2023 నుంచి ఆయన జైలులోనే ఉండగా.. ఇటీవలి కాలంలో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన చికిత్స అందించకుండా ఇమ్రాన్ ఖాన్‌ను ఇబ్బంది పెడుతోందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ప్రైవేటు ఆస్పత్రిలో ఇమ్రాన్‌కు చికిత్స అందేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, కోర్టు చెప్పినట్లుగానే ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన పాక్ ప్రభుత్వం.. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఇమ్రాన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని తేలిందని.. మళ్లీ అడియాలా జైలుకు తరలించింది.
మరోసారి విమర్శలు
దీంతో మరోసారి పాక్ సర్కార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ విషయంపై ఇప్పటికే 21 మంది అంతర్జాతీయ జట్ల మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు వారికి ప్యాట్ కమిన్స్ కూడా జతకలిశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ఇమ్రాన్ ఆరోగ్యం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.
ఇమ్రాన్ ఖాన్ మానసికంగా అత్యంత బలమైన వ్యక్తి అని.. అయితే, మూడేళ్ల పాటు బంధీఖానాలో పడి ఉంటే ఎంతటివారైనా ఇబ్బంది పడతారని చాపెల్ పేర్కొన్నాడు. కంటి చికిత్స కోసం ఇమ్రాన్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడని.. అతడికి మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే తాము ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశాడు.
కమిన్స్ స్పందన ఇదే
ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన ప్యాట్ కమిన్స్.. ‘‘గ్రెగ్ చాపెల్‌తో పాటు ఇతర అంతర్జాతీయ జట్ల మాజీ కెప్టెన్లకు నా మద్దతు ప్రకటిస్తున్నా. చికిత్స కొనసాగించడంతో పాటు.. కుటుంబం తరచూ ఆయనను కలిసేలా కోర్టు ఆదేశాలు ఇస్తుందని ఆశిస్తున్నా. ఇమ్రాన్ ఖాన్ విషయంలో గౌరవప్రదంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నా. నిజానికి ప్రతి ఒక్కరూ అందుకు అర్హులు’’ అని పేర్కొన్నాడు.
చదవండి: లార్డ్స్ టెస్టులో పొలిటికల్ హీట్.. పాక్ బెదిరింపులు!
Adding my support here to GC and the other former international captains. I hope the court ordered medical assessment be allowed to run its course, and that family visits continue. I hope Imran Khan is treated with the dignity anyone deserves https://t.co/L1L512wXao
— Pat Cummins (@patcummins30) August 28, 2026


