పాకిస్తాన్ ప్రభుత్వం గురించి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఉనికే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని.. అయితే, సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి సాధ్యం కావని తెలిసి మిన్నకుండిపోయిందన్నాడు.
అవినీతి ఆరోపణలతో..
కాగా పాకిస్తాన్‌కు మొట్టమొదటి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన ఇమ్రాన్.. ఏకంగా ప్రధాని స్థాయికి ఎదిగాడు. కానీ అనతికాలంలోనే అతడి ప్రతిష్ట మసకబారింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్.. 2023 నుంచి జైలులోనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. అతడికి సరైన చికిత్స అందించకుండా ప్రభుత్వం వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఇమ్రాన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు...
నిజానికి నిబంధనల ప్రకారం ఖైదీలకు జైలులోనే వైద్య చికిత్స అందిస్తామని.. అవసరమైతేనే ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రమే తరలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ ఇదివరకు వెల్లడించారు.
అయితే, కోర్టు ఆదేశాలతో ఇమ్రాన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ.. పరీక్షల అనంతరం మళ్లీ అడియాలా జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు అల్ షిపా ఆస్పత్రి వైద్యుల పరీక్షలో తేలిందని ప్రభుత్వం ప్రకటించింది.
21 మంది లేఖ
ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలని పలువురు మాజీ కెప్టెన్లు ప్రభుత్వాన్ని కోరారు. తొమ్మిది దేశాలకు చెందిన 21 మంది పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌నకు మరోసారి లేఖ రాశారు. ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఉనికే లేకుండా చేయాలని చూశారు
ఈ విషయం గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ ఆథర్టన్ తాజాగా స్పందించాడు. ‘‘మానవతా దృక్పథంతో స్పందించి ఇమ్రాన్ ఖాన్‌కు సరైన రీతిలో చికిత్స అందేలా చూడాలని 21 మంది మాజీ కెప్టెన్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో నేను, నాసిర్ హుసేన్ కూడా ఉన్నాము.
నాకైతే.. రాజ్యం (ప్రభుత్వం) ఇమ్రాన్ ఆనవాళ్లు, ఉనికి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందనే అనిపించింది. అయితే, సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి సాధ్యం కానేకావు’’ అని ఆథర్టన్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
కాగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు పాక్ మాజీ క్రికెటర్లు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే, వాళ్లు ప్రస్తుతం దేశంలో ఉన్నందున ఆ ధైర్యం చేయలేకపోవచ్చని కపిల్ దేవ్ ఇటీవల పేర్కొన్నాడు.


