ఆసియా కప్ 2026 కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. సాధారణంగా కనిపించని విధంగా పురుషుల జట్టుతో టీ20 మ్యాచ్‌లు ఆడి కీలక టోర్నీకి సన్నద్ధమైంది. ఆగస్టు 28 నుంచి మహిళల ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో, పాక్ క్రికెట్ బోర్డు ఈ ప్రత్యేక ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేసింది.
ఫాతిమా సనా నాయకత్వంలోని పాకిస్తాన్ మహిళల జట్టు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో భాగంగా అబ్దుల్ ఖాదిర్ క్రికెట్ అకాడమీ పురుషుల జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
పూర్తి స్థాయి టీ20 మ్యాచ్‌లు
ఇవి కేవలం నెట్స్‌లో నిర్వహించే సిమ్యులేషన్ మ్యాచ్‌లు కావు. పూర్తి స్థాయి టీ20 నిబంధనలతోనే ఈ రెండు మ్యాచ్‌లు నిర్వహించారు. పురుషుల జట్టుతో ఆడటం ద్వారా మహిళల ఆటగాళ్లకు మరింత వేగం, ఒత్తిడి, పోటీ వాతావరణం ఎదురైంది.
ముఖ్యంగా కీలక సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను అమలు చేయడం వంటి అంశాలపై ఈ మ్యాచ్‌లు ఉపయోగపడ్డాయని జట్టు భావిస్తోంది.
పురుషుల జట్టుతో ఎందుకు ఆడారు..?
ఆసియా కప్‌కు ముందు తమ జట్టును ఒత్తిడిలో పరీక్షించడమే ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల ప్రధాన ఉద్దేశమని కెప్టెన్ ఫాతిమా సనా వెల్లడించింది. పెద్ద టోర్నీల్లో కీలక సమయాల్లో ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది.
ఆసియా కప్‌లో పాక్‌కు అంతగా కలిసిరాని రికార్డు
పాకిస్తాన్ మహిళల జట్టు ఇప్పటివరకు ఆసియా కప్‌ను ఒక్కసారి కూడా గెలవలేదు. 2012, 2016లో ఫైనల్‌కు చేరినప్పటికీ రెండు సార్లూ భారత్ చేతిలో ఓడిపోయింది. గత ఎడిషన్‌లో మాత్రం సెమీఫైనల్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది.
గ్రూప్-Aలో భారత్‌తో పాక్
ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ గ్రూప్-Aలో భారత్‌తో పాటు ఉంది. సెప్టెంబర్ 1న థాయ్‌లాండ్‌తో మ్యాచ్ ద్వారా పాక్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
ఆ తర్వాత సెప్టెంబర్ 5న భారత్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. గతంలో ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయాల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ పోరులో ముందుకు వెళ్లాలని పాక్ భావిస్తోంది.


