source: X
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మార్ష్.. ఆస్ట్రేలియా రాబోయే వైట్-బాల్ సిరీస్‌లకు సిద్ధం కావడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
స్టీవ్ వా నేతృత్వంలోని కన్సార్టియం యాజమాన్యంలో ఉన్న ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టు మార్ష్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. మార్ష్‌ను జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే కోడ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేనియల్ చెర్నీ కథనం ప్రకారం.. మార్ష్ తాజాగా ETPL నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనల్లో వైట్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు సన్నద్ధం కావడానికే మార్ష్ యూరోపియన్ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ యాజమాన్యం నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ETPL తొలి సీజన్‌లో ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 26న రోటర్‌డామ్ డాకర్స్‌తో ఆడాల్సి ఉంది.
కెప్టెన్సీ రేసులో స్మిత్, రహానే
మార్ష్ తప్పుకుంటే ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానే, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
భారత మాజీ టెస్టు కెప్టెన్ రహానే ఇటీవల భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ETPL తొలి సీజన్ కోసం ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు.
ది హండ్రెడ్‌లో అదరగొట్టిన మార్ష్
మార్ష్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2026 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన అతడు రెండు సందర్భాల్లో 90కి పైగా పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున విధ్వంసక బ్యాటింగ్ చేశాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 169.80 స్ట్రైక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతడి సహకారంతో సన్‌రైజర్స్ లీడ్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది.
అయితే ఎలిమినేటర్-1లో చివరకు ఛాంపియన్‌గా నిలిచిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ లీడ్స్ ఓటమి పాలైంది.


