ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు | Ex international captains renew appeal to Pakistan PM over Imran Khan condition | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ ఖాన్ కోసం మాజీ కెప్టెన్లు

Aug 24 2026 8:11 AM | Updated on Aug 24 2026 8:56 AM

Ex international captains renew appeal to Pakistan PM over Imran Khan condition

source: X

పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, 1992 ప్రపంచకప్ విజేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలుదేశాలకు చెందిన 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు వారు లేఖ రాశారు. ఆరు నెలల వ్యవధిలో మాజీ క్రికెటర్లు ఇలాంటి విజ్ఞప్తి చేయడం ఇది రెండోసారి.

భారత్‌కు చెందిన మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు గ్రెగ్ చాపెల్, అలన్ బోర్డర్, ఇయాన్ చాపెల్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైక్ గాటింగ్, ఆండ్రూ స్ట్రాస్, అలిస్టర్ కుక్, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

పాకిస్తాన్‌లో ఈ వారంలో ఇమ్రాన్ ఖాన్‌కు జరిగిన స్వల్పకాలిక వైద్య పరీక్ష అనంతరం ఈ విజ్ఞప్తి వెలువడింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించలేదని మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రశ్నలు
ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ఆయన సొంత వైద్యులు, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కూడా చేర్చాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించినట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి భేటీ అయ్యే అవకాశాన్ని పునరుద్ధరించాలని కూడా ఆదేశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు గుర్తుచేశారు.

అయితే ఇమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉంచి తిరిగి జైలుకు తరలించారని వారు పేర్కొన్నారు. కోర్టు ఆదేశించిన వైద్య బోర్డు పూర్తి స్థాయిలో తన పరీక్షను నిర్వహించకముందే ఈ ప్రక్రియ ముగిసిందని ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, న్యాయ బృందం ఆరోపిస్తోంది.

ఇమ్రాన్‌ను కోర్టు సూచించిన బోర్డు కాకుండా ప్రభుత్వం నియమించిన వైద్య బృందం పరీక్షించిందని, అనంతరం ఆయనను ‘వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారు’ అని ప్రకటించి అడియాలా జైలుకు తిరిగి పంపించారని లేఖలో పేర్కొన్నారు.

మూడు ప్రధాన డిమాండ్లు

మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మూడు ప్రధాన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* కోర్టు ఆదేశించిన వైద్య బోర్డు స్వతంత్రంగా ఇమ్రాన్ ఖాన్‌ను పరీక్షించే అవకాశం కల్పించాలి.
* కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి జరిగే భేటీలను పునరుద్ధరించాలి.
* వైద్య పరీక్షల అనంతరం అవసరమని సూచించే చికిత్సను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలి.

ఈ విజ్ఞప్తి పాకిస్తాన్ అంతర్గత రాజకీయ లేదా న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదని మాజీ క్రికెటర్లు స్పష్టం చేశారు. తాము రాజకీయ నాయకులుగా కాకుండా క్రికెట్ మైదానంలో ఇమ్రాన్‌తో కలిసి ఆడిన లేదా ప్రత్యర్థులుగా తలపడిన మాజీ ఆటగాళ్లుగా ఈ విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

‘అసాధారణమైన డిమాండ్ ఏమీ కాదు’
ఈ లేఖను ప్రారంభించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌ను తాము అసాధారణమైనదేమీ కోరడం లేదని అన్నారు.

“చాలా దేశాల్లో సహజంగా అమలు చేసే కోర్టు ఆదేశాన్ని పాకిస్తాన్‌లో కూడా అమలు చేయాలని మాత్రమే మేము కోరుతున్నాం” అని చాపెల్ పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులు, కుటుంబ సభ్యులతో భేటీలపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజా లేఖతో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.

ఈ లేఖపై మైఖేల్ అథర్టన్, అలెక్స్ బ్లాక్‌వెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రీర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, అలిస్టర్ కుక్, మైక్ గాటింగ్, సునీల్ గవాస్కర్, లీ జెర్మన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాసర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, అర్జున రణతుంగ, ఆండ్రూ స్ట్రాస్, దిలీప్ వెంగ్‌సర్కార్, స్టీఫెన్ వా, జాన్ రైట్ తదితరులు సంతకాలు చేశారు.

చదవండి: పోలీసుల అదుపులో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement