పోలీసుల అదుపులో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ | Brydon Carse In Handcuffs After Another Nightclub Incident, Ben Stokes Present | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌

Aug 24 2026 6:59 AM | Updated on Aug 24 2026 7:02 AM

Brydon Carse In Handcuffs After Another Nightclub Incident, Ben Stokes Present

ఇంగ్లండ్ క్రికెట్ జట్టును మరోసారి ఆఫ్‌ఫీల్డ్ వివాదం వెంటాడుతోంది. ఇంగ్లండ్ స్టార్‌ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల పోలీసుల చేతికి చిక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్స్ చేతులకు బేడీలు వేసి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపించాయి. అయితే కార్స్‌ను అరెస్టు చేయలేదని, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించింది.

డర్హామ్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడిన అనంతరం జట్టు సభ్యులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు డెర్బీలోని నైట్‌క్లబ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్వల్ప నిడివి వీడియోలో కార్స్‌ను పలువురు పోలీసులు చుట్టుముట్టి ఉండగా, అతడి చేతులు వెనుకకు ఉంచి బేడీలు వేసినట్లు కనిపించింది. డర్హామ్ సహచరుడు మాథ్యూ పాట్స్ కూడా కార్స్‌తో మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.

ఘటనాస్థలంలో బెన్ స్టోక్స్
ఈ ఘటన సమయంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అక్కడే కనిపించడం మరింత చర్చకు దారితీసింది. డర్హామ్ తరఫున అదే మ్యాచ్‌లో ఆడిన స్టోక్స్.. డెర్బీషైర్‌పై జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకు ఐదు వికెట్లు తీసి డెర్బీషైర్‌ను 84 పరుగులకే కుప్పకూల్చడంలో అతడు ప్రధాన పాత్ర పోషించాడు.

అయితే నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటన ఇంగ్లండ్ జట్టు అధికారిక కార్యక్రమంలో భాగం కాదని తెలుస్తోంది. కార్స్ కూడా ఆ సమయంలో ఇంగ్లండ్ జాతీయ జట్టు విధుల్లో లేడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడిని డర్హామ్ తరఫున కౌంటీ మ్యాచ్ ఆడేందుకు విడుదల చేశారు.

ఈసీబీ దర్యాప్తు
ఘటనపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్పందిస్తూ.. డెర్బీలో జరిగినట్లు సమాచారం అందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్స్‌పై తదుపరి చర్యల విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అతడు ప్రస్తుతం పాకిస్తాన్‌తో లార్డ్స్‌లో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో కొనసాగుతున్నాడు.

ఆగస్టు 27 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయం సాధించినప్పటికీ కార్స్ తుది జట్టులో ఆడలేదు. గత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన అతడికి రెండో టెస్టులో అవకాశం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే తాజా ఘటన తర్వాత అతడి ఎంపికపై ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం కీలకం కానుంది.

వరుస వివాదాలు
కార్స్ ఘటన ఇంగ్లండ్ క్రికెట్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆఫ్‌ఫీల్డ్ వివాదాల పరంపరలో మరొకటిగా మారింది. గతంలోనూ నైట్‌క్లబ్‌లు, మద్యం, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందులు తెచ్చాయి. తాజాగా కార్స్ ఘటన నేపథ్యంలో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై ECB నిబంధనలు మరోసారి చర్చకు వచ్చాయి.

కార్స్‌కు గతంలోనూ క్రమశిక్షణకు సంబంధించిన సమస్య ఎదురైంది. 2017 నుంచి 2019 మధ్య క్రికెట్‌కు సంబంధించిన బెట్టింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో 2024లో అతడిపై సస్పెన్షన్ విధించారు.

ప్రస్తుతం కార్స్‌పై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు లేవు. పోలీసులు అతడిని ఘటనాస్థలంలో తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement