source: X
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత కూడా సంచలన ప్రదర్శనలతో ఇరగదీస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టోక్స్.. డర్హామ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో (108) కదంతొక్కిన స్టోక్స్.. తాజాగా డెర్బీషైర్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు (53 (61), 66 నాటౌట్ (55)) చేసి, బౌలింగ్‌లో 5 వికెట్ల ప్రదర్శన సహా మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు (2-14, 5-17) తీశాడు.
స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో అతడి జట్టు డర్హామ్ 338 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా డెర్బీషైర్‌కు ఇది అత్యంత భారీ ఓటమి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. కెప్టెన్ అలెక్స్ లీస్ (63), స్టోక్స్ (53), గ్రహం క్లార్క్ (64) అర్ద సెంచరీలతో రాణించడంతో 283 పరుగులు చేసింది. అనంతరం డెర్బీషైర్ కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. డర్హామ్ పేసర్ మాథ్యూ పాట్స్ 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో డర్హామ్ 295/6 వద్ద డిక్లేర్ చేసింది. బెన్ మెక్‌కిన్నీ సూపర్ సెంచరీతో (162 బంతుల్లో 140 పరుగులు) మెరవగా.. స్టోక్స్ (66 నాటౌట్), విల్ రోడ్స్ (52) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. 423 పరుగుల లక్ష్య ఛేదనలో స్టోక్స్ (5-17), పాట్స్ (3-22) ధాటికి డెర్బీషైర్ 84 పరుగులకే కుప్పకూలింది. దీంతో డెర్బీషైర్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటమి చవిచూసింది.


