పడిక్కల్‌ పరుగుల ప్రవాహం | Indian batsman Devdutt Padikkal scores second consecutive century | Sakshi
Sakshi News home page

పడిక్కల్‌ పరుగుల ప్రవాహం

Aug 24 2026 4:16 AM | Updated on Aug 24 2026 4:21 AM

Indian batsman Devdutt Padikkal scores second consecutive century

వరుసగా రెండో సెంచరీ చేసిన భారత బ్యాటర్‌

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 300/5

రాణించిన గిల్, జైస్వాల్, జడేజా

వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ వరుసగా రెండో సెంచరీతో విజృంభించడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో భారత జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. పడిక్కల్‌ ప్రతాపానికి శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌ సహకారం తోడవడంతో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం కనబర్చగా... సంప్రదాయానికి విరుద్ధంగా పేస్‌ పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక తొలి రోజు ఐదు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌ కొనసాగుతున్నకొద్దీ వికెట్‌ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో టీమిండియా ఎంత స్కోరు చూస్తుందో చూడాలి!  

కొలంబో:  శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (193 బంతుల్లో 117; 12 ఫోర్లు) మరో సెంచరీతో కదంతొక్కాడు. గిల్‌ (108 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (45; 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. 

కేఎల్‌ రాహుల్‌ (18) విఫలం కాగా... వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (3) గాయం కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే భిన్నమైన పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక... దాన్ని కాస్త సద్వినియోగం చేసుకోగలిగింది. గాయం నుంచి కోలుకున్న పంత్‌ బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండగా... జురేల్‌ (7 బ్యాటింగ్‌), సారాంశ్‌ జైన్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

వరుసగా రెండో శతకం... 
రెండేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొని... గత టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న పడిక్కల్‌ ఈ మ్యాచ్‌లోనూ దుమ్మురేపాడు. గాలేలో ఎక్కడ ఆపాడో... కొలంబోలో అక్కడి నుంచే ప్రారంభించాడు. శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలతో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగాడు. 

అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌ తరహాలో వీలుచిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ స్ట్రయిక్‌ రొటేషన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాడు.ఒక దశలో గిల్‌ వేగంగా పరుగులు చేస్తుంటే మరో ఎండ్‌లో సంయమనం పాటించిన పడిక్కల్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రాహుల్‌ ఎక్కువసేపు నిలవలేపోగా ... జైస్వాల్‌ మరోసారి మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఈ దశలో గిల్‌తో కలిసి పడిక్కల్‌ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు.

హాఫ్‌సెంచరీ పూర్తయ్యాక గిల్‌ అవుట్‌ కాగా... లహిరు బౌలింగ్‌లో పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా క్రీజు వీడాడు. పిచ్‌ బౌన్స్‌కు సహకరిస్తుండటంతో శ్రీలంక పేసర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో ఇబ్బంది పెట్టినా పడిక్కల్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. జడేజా సహకారంతో 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌ కాసేపటికి అవుటయ్యాడు. తొలి రోజు చివరి ఓవర్‌లో జడేజా కూడా అవుటవ్వడంతో లంక సంతృప్తికరంగా రోజును ముగించింది.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఫెర్నాండో 45; రాహుల్‌ (సి) డిక్‌వెలా (బి) లహిరు కుమారా 18; పడిక్కల్‌ (బి) కేషారా నువాంతా 117; గిల్‌ (సి) డిక్‌వెలా (బి) ఫెర్నాండో 50; పంత్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 3; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్‌ (బ్యాటింగ్‌) 7; సారాంశ్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–37, 2–66, 3–186, 4–281, 5–296. బౌలింగ్‌: ఫెర్నాండో 16–5–46–3; లహిరు 13–4–38–1; జయసూర్య 27–4–90–0; కేషారా 22–0–93–1; దినుషా సోనాల్‌ 1–0–2–0; ధనంజయ 2–0–8–0; కమిల్‌ 4–0–16–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement