రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్‌ స్టార్‌ | Karn Sharma Announces Retirement, After Nearly Two Decades Of Cricket And Leaves Behind Three IPL Titles, Check His Records And Stats | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్‌ స్టార్‌

Aug 23 2026 1:46 PM | Updated on Aug 23 2026 2:26 PM

Karn Sharma calls time on India and domestic career

source: mumbai indians X

ఐపీఎల్‌ స్టార్‌, భారత లెగ్‌ స్పిన్నర్ కర్ణ్ శర్మ 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యూపీ టీ20 లీగ్‌ 2026లో ఆగస్టు 25న జరిగే మ్యాచ్‌ తనకు చివరిదని ప్రకటించాడు.

2007-08 దేశవాళీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 అరంగేట్రం చేసిన కర్ణ్.. తొలుత ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. 2012-13 సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌ల్లో 19.04 సగటుతో 21 వికెట్లు తీసి బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డు అందుకున్నాడు.

2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అన్‌క్యాప్డ్ భారత ఆటగాడికి దక్కిన అత్యధిక వేలం ధర ఇదే.

అదే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడి ఏకైక వికెట్‌గా జో రూట్‌ను ఔట్ చేశాడు. అనంతరం శ్రీలంకతోసిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ 264 పరుగులు చేసిన చారిత్రాత్మక వన్డేలో కర్ణ్ శర్మ కూడా ఆడాడు.

2014 చివర్లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేసి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండేసి వికెట్లు తీశాడు. అయితే అదే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మారింది. 2015లో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా వెళ్లలేకపోయాడు. ఆ తర్వాత భారత్ తరఫున మళ్లీ ఆడే అవకాశం రాలేదు.

ఐపీఎల్‌లో అరుదైన ఘనత
కర్ణ్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన రికార్డు సాధించాడు. మూడు వరుస సీజన్లలో మూడు వేర్వేరు జట్లతో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

* 2016: సన్‌రైజర్స్ హైదరాబాద్
* 2017: ముంబై ఇండియన్స్
* 2018: చెన్నై సూపర్ కింగ్స్

అంతేకాదు, ఐపీఎల్‌లో అతను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి భారత దిగ్గజాలతో కలిసి ఆడాడు. 2025లో ముంబై ఇండియన్స్ తరఫున అతడి చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

కర్ణ్ శర్మ కెరీర్ గణాంకాలు
* టెస్టులు: 1 మ్యాచ్
* వన్డేలు: 2 మ్యాచ్‌లు
* టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు: 1
* ఫస్ట్‌క్లాస్: 97 మ్యాచ్‌లు, 270 వికెట్లు
* ఫస్ట్‌క్లాస్ బ్యాటింగ్: 2,866 పరుగులు, 2 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు
* లిస్ట్-ఏ: 123 మ్యాచ్‌లు, 153 వికెట్లు
* టీ20లు: 191 మ్యాచ్‌లు, 168 వికెట్లు
* ఐపీఎల్: 90 మ్యాచ్‌లు, 83 వికెట్లు

అంతర్జాతీయ స్థాయిలో కేవలం నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైనప్పటికీ, దాదాపు రెండు దశాబ్దాల దేశవాళీ కెరీర్, మూడు ఐపీఎల్ టైటిళ్లు, 270 ఫస్ట్‌క్లాస్ వికెట్లు కర్ణ్ శర్మను భారత దేశవాళీ క్రికెట్‌లో గుర్తుండిపోయే లెగ్‌స్పిన్నర్‌గా నిలబెట్టాయి.

రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌తో పాటు క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతల్లో కొనసాగుతానని కర్ణ్ శర్మ వెల్లడించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement