పహల్గామ్ అటాక్‌.. హఫీజ్‌ సయీద్‌కు సమన్లు | india to summon pakistani terrorist hafiz saeed in pahalgam case | Sakshi
Sakshi News home page

పహల్గామ్ అటాక్‌.. హఫీజ్‌ సయీద్‌కు సమన్లు

Aug 22 2026 9:12 PM | Updated on Aug 22 2026 9:19 PM

india to summon pakistani terrorist hafiz saeed in pahalgam case

ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రదారి  లష్కర్-ఎ-తోయిబా (LeT) వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు కోర్టు సమన్లు జారీ చేసే దిశగా భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ఈ సమన్లను పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు  సమాచారం అందుతుంది.

2025లో పహల్గామ్‌లోయలో ఉగ్ర దాడి జరిగింది. ఇందులో 26 మంది పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో  జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో అతడిపై ఇప్పటికే జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

సమన్లు ఎందుకు కీలకం?

హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌లో ఉన్నందున భారత దర్యాప్తు సంస్థలు నేరుగా అతడికి కోర్టు నోటీసులు అందజేయడం సాధ్యం కాదు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక వ్యవస్థ ద్వారా కోర్టు సమన్లు అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఒక నిందితుడికి కోర్టులో హాజరై తన వాదన వినిపించే అవకాశం ఇచ్చినట్లు చట్టపరమైన రికార్డులో నమోదు చేయడం ఈ చర్యలో ముఖ్యమైన అంశం.

సమన్లు అందించిన తర్వాత సైతం హఫీజ్‌ సయీద్‌ కోర్టుకు హాజరుకాకపోతే, తదుపరి దశగా అతడిని "ప్రొక్లెయిమ్డ్ అఫెండర్" గా ప్రకటించే ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది. భారత చట్టం ప్రకారం, అటువంటి వ్యక్తి పరారీలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అతడి గైర్హాజరీలో దర్యాప్తు, విచారణ లేదా తీర్పు ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి కుట్ర కేసులో హఫీజ్‌ సయీద్‌ పాత్రను NIA ప్రత్యేకంగా ప్రస్తావించింది. అతడు లష్కర్-ఎ-తయిబా నాయకుడిగా ఉండటంతో పాటు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే మరో ఉగ్రవాద సంస్థతోనూ సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన హఫీజ్‌ సయీద్‌ ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసుల్లో అతడికి శిక్ష పడిన తర్వాత పాకిస్థాన్ అధికారుల అదుపులోనే ఉన్నాడని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అయితే, హఫీజ్‌ సయీద్‌ వంటి ఉగ్రవాదులను అంతర్జాతీయ చర్యల నుంచి కాపాడేందుకు పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలోని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.

పాకిస్థాన్‌కు అప్పగించే ఒప్పందం ఉందా?

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం ప్రత్యేకంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక నేరస్తుల అప్పగింత (extradition) ఒప్పందం లేదు. అందువల్ల హఫీజ్‌ సయీద్‌ను నేరుగా భారత్‌కు అప్పగించే ప్రక్రియ సులభం కాదు.అయితే భారత్‌ ఇప్పటికే హఫీజ్‌ సయీద్‌ను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా చాలా సంవత్సరాల క్రితమే గుర్తించింది. అంతేకాకుండా అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement