వాషింగ్టన్: ఓ వ్యక్తి 120 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని మోంటానా జాతీయ ఉద్యానవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలో నివసించే కెన్ నర్స్ తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్లేసియర్ జాతీయ ఉద్యానవనానికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రదేశం నుంచి మెక్‌డొనాల్డ్ వాగులోకి పడిపోయినట్లు నాన్‌స్టాప్ లోకల్ మోంటానా తెలిపింది.
హెలికాప్టర్ శోధన, రక్షణ సంస్థ టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు ప్రకారం.. కెన్ జలపాతాల వరుస మీదుగా జారిపడి నీటిలో ముఖం కిందకు పెట్టుకుని కనిపించాడు. కెన్, అతడి కుటుంబ సభ్యులు ఫొటోలు తీసుకుంటున్నారని అతడి భార్య రీనే నర్స్ నాన్‌స్టాప్ లోకల్ మోంటానాకు తెలిపింది. అయితే చలి నుంచి బయటపడేందుకు ఆమె కారులోకి వెళ్లిన సమయంలో మెరుగైన దృశ్యం కోసం కెన్ అంచుకు దగ్గరగా వెళ్లాడు. ఒక్కసారిగా నేల కుంగిపోవడంతో అతడు సుమారు 120 అడుగుల లోతులోని వాగులో పడిపోయాడు.
కెన్ నీటిలో ముఖం కిందకు పెట్టుకుని ఉండటాన్ని గుర్తించిన ఆ వ్యక్తి వాగులోకి దిగి అతడిని లోతు తక్కువగా ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడ అతడికి గుండె స్పందనను తిరిగి తీసుకురావడానికి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం కెన్‌లో స్వయంగా రక్త ప్రసరణ, గుండె స్పందన తిరిగి ప్రారంభమైనట్లు టూ బేర్ ఎయిర్ రెస్క్యూ తెలిపింది.
గ్లేసియర్ జాతీయ ఉద్యానవన రక్షణ సిబ్బంది కెన్‌కు చికిత్స అందిస్తుండగా టూ బేర్ ఎయిర్ రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. సంస్థ విడుదల చేసిన వీడియోలో సిబ్బంది కెన్‌ను భద్రపరిచి నీటి నుంచి పైకి తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కెన్‌ను వైద్య హెలికాప్టర్‌లోకి తరలించి పరిస్థితిని స్థిరపరిచారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: 15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ వ్యక్తి వేగంగా స్పందించిన తీరును టూ బేర్ ఎయిర్ రెస్క్యూ ప్రశంసించింది. అతడి చర్యలే బాధితుడి ప్రాణాలను కాపాడాయని తెలిపింది. నాన్‌స్టాప్ లోకల్ మోంటానా ప్రకారం, కెన్ 2 రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాడు. మెలకువ వచ్చిన తర్వాత అతడికి ఆక్సిజన్ అందించారు. అతడికి పలు పక్కటెముకలు పగిలాయి. మోచేయికి తీవ్రమైన ఎముక విరుగు గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఊపిరితిత్తుల్లో ద్రవం కూడా చేరింది. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు దక్కాలని కెన్ కోరుకున్నాడు.


