ఒక వైపు దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఉగ్ర ముప్పు.. మరోవైపు చైనా నుంచి పెరుగుతున్న వ్యూహాత్మక సవాలు! భారత్ భద్రతకు ముందు ముందు అసలు పరీక్ష ఎక్కడ? పశ్చిమ సరిహద్దుల్లోనా.. తూర్పు సరిహద్దుల్లోనా?.. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తక్షణ ముప్పే అయినా.. రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు ప్రధాన పోటీదారు మాత్రం చైనానే అని ఆయన తేల్చి చెప్పారు.
చైనా, పాకిస్తాన్ రెండింటినీ ఒకే విధంగా చూడలేమని నరవణే స్పష్టం చేశారు. రెండు దేశాలతోనూ భారత్ యుద్ధాలు చేసిందని, ఇరువురితోనూ సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అయితే పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న ఉగ్రవాద ముప్పు కారణంగా ప్రస్తుతం భారత దృష్టి పశ్చిమ సరిహద్దులపైనే ఉందన్నారు. కానీ దీర్ఘకాలిక, వ్యూహాత్మక లెక్కల్లో చైనానే ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతుందని నరవణే అన్నారు. అంతేకాదు.. చైనాను శత్రువుగా కాకుండా ప్రధాన పోటీదారుగా చూడాలని ఆయన చెప్పడం కీలకంగా మారింది.
చైనాతో పోటీ కేవలం సరిహద్దుల్లోనే ఉండదని నరవణే పేర్కొన్నారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ భారత్-చైనా పోటీ పెరుగుతుందని అన్నారు. పోటీ ఉన్న చోట కొంత ఘర్షణ సహజమే అయినా.. ప్రతి విభేదం యుద్ధంగా మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాతో సమస్యలను చర్చలు, దౌత్యం, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవడమే భారత్ తొలి ప్రాధాన్యత కావాలని ఆయన సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా మాత్రమే ఉండాలని అన్నారు. అయితే దౌత్యం పనిచేయని పరిస్థితి వస్తే.. భారత్ వెనక్కి తగ్గకుండా ఉండేందుకు బలమైన సైనిక నిరోధక శక్తి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
అంటే నరవణే సందేశం క్లియర్‌గా చర్చలకు సిద్ధంగా ఉండాలి.. కానీ బలహీనంగా కాదు. శాంతిని కోరుకోవాలి.. కానీ అవసరమైతే సమాధానం చెప్పే శక్తి కూడా ఉండాలి అని. ఇదే సమయంలో భారత్ భద్రత కేవలం పాక్, చైనాతోనే పరిమితం కాదని నరవణే గుర్తుచేశారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగుదేశాల్లో స్థిరత్వం కూడా భారత ప్రయోజనాలకు కీలకమన్నారు. పొరుగుదేశాల్లో అస్థిరత ఏర్పడితే శరణార్థులు, స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణా వంటి సమస్యలు నేరుగా భారత్‌పై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. మయన్మార్‌ను ఉదాహరణగా తీసుకున్న నరవణే.. పొరుగుదేశం తగలబడుతుంటే మనం సంతోషంగా ఉండలేమనే భావనను వ్యక్తం చేశారు. అందుకే పొరుగు దేశాల్లో స్థిరత్వం కోసం భారత్ తన వంతు పాత్ర పోషించాలని సూచించారు.


