బ్రిక్స్ న్యూఢిల్లీ సమావేశాల్లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్
‘బ్రిక్స్’ను చైనా హైజాక్ చేస్తుందా అంటూ గతంలోనూ ఉండిన చర్చ, ఆ సంస్థ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మీడియాలో మరోసారి జరిగింది. ఆ పని నిజంగా జరగవచ్చునా? ఒక్క మాటలో చెప్పాలంటే, అది చైనా కోరుకున్నా సాధ్యమయ్యేది కాదు; హైజాక్ చేయాలన్న ఆలోచన వారి వ్యూహంలోనూ భాగం కాదు. హైజాక్ అంటే ఏమిటి? ఒక వ్యవస్థను, లేక ఒక కార్యక్రమాన్ని, ఒక వాహనాన్ని తన ప్రయోజనాల కోసం దాని మార్గం నుంచి అక్రమంగా, బలవంతంగా దారి మళ్లించటం.
ఈ నిర్వచనం చెప్పుకున్న తర్వాత చర్చలోకి వెళదాం. 2006లో ఏర్పడి, 2009లో లాంఛనప్రాయంగా రూపుతీసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. తర్వాత 2011లో దక్షిణాఫ్రికా చేరింది.
సంస్థ ప్రాథమిక లక్ష్యాలు ముఖ్యమైన వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించటం, వాణిజ్యాభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ కోసం ప్రయత్నించటం వంటివి. తర్వాత కాలంలో, పరస్పరం స్థానిక కరెన్సీలలో చెల్లింపులు, అందుకోసం వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బ్యాంకు స్థాపన వంటివి అజెండాలోకి వచ్చాయి. వర్ధమాన దేశాలపై జరిగే అన్యాయపు దాడులను విమర్శించటమూ ఆరంభించారు.
ముడివడిన ప్రయోజనాలు
ఇవి అన్నీ ఉమ్మడి లక్ష్యాలు అయినందున బ్రిక్స్ దేశాలన్నిటి స్వీయ ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయన్నమాట. అటువంటపుడు వారు ఈ ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పని చేయటం ద్వారానే సంస్థ విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆ విధంగా అందరి ప్రయోజనాలు నెరవేరుతాయి. చైనావి కూడా. ఆ స్థితిలో చైనా తక్కిన దేశాలతో కలిసి పని చేయవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సంస్థ భంగపడి తన ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. ఇది మౌలిక స్థితి. గమనించవలసింది మరొకటి ఉంది.
‘బ్రిక్స్’లోని దేశాలు మొదటగాని, తర్వాత చేరినవిగాని ఏవీ చిన్నవి, బలహీనమైనవి కావు. దేనికది శక్తిమంతమైనదే. స్వతంత్రంగా, బలంగా ఎదగాలన్న స్వతంత్రేచ్ఛతో స్వచ్ఛందంగా సంస్థలో చేరుతున్నవే. పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని, ఏకపక్ష నిర్ణయాలను, వివిధ అంతర్జాతీయ సంస్థలపై నియంత్రణలను, ఆ సంస్థలలోకి ఇతరులను రానివ్వకపోవటాన్ని నిరసిస్తున్నవే. ఉదాహరణకు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఒక పాశ్చాత్య విలేఖరి ‘మీకెందుకు ఈ బ్రిక్స్ క్లబ్?’ అంటూ ఒకసారి ప్రశ్నించగా, ‘వాళ్లకు (పాశ్చాత్యులని భావం) వాళ్ల క్లబ్బులున్నాయి. వాటిలోకి మమ్మల్ని రానివ్వటం లేదు. మా క్లబ్ మేం పెట్టుకున్నాం’ అని జవాబిచ్చారు.
నిజానికి జైశంకర్ అనలేదు గాని, వాళ్లకు వారి క్లబ్బులు ఉన్నవి వారి ప్రయోజనాలకు మాత్రమే! కనుకనే ఇతరులను రానివ్వరు. వాటిపై పూర్తి నియంత్రణ వారిదే అవుతుంది. అందుకే బ్రిక్స్ సమావేశాలు కజాన్ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థల అధ్యక్షులు ప్రతిసారి పాశ్చాత్యులే కావాటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ వస్తున్నాయి. విషయం ఏమంటే, ఈ విధంగా వివిధ సంస్థల వ్యవహారాలపై ఏకపక్ష ఆధిపత్యాలను వ్యతిరేకిస్తూ ఏర్పడిన ‘బ్రిక్స్’పై చైనా ఆధిపత్యాన్ని, హైజాకింగ్‌ను ఎవరైనా ఎందుకు సమ్మతిస్తారు? సమ్మతించనపుడు హైజాకింగ్ ఎలా సాధ్యపడుతుంది? ఆ పని బలవంతంగా చేయబూనితే బ్రిక్స్ భంగపడుతుంది, చైనా లక్ష్యాలు నెరవేరవు.
ఎందుకు చేయజూడదు?
ఇక్కడ మరొకటి గుర్తించాలి. బ్రిక్స్ సభ్యులందరి రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఒకే విధమైనవి కావు. ప్రజాస్వామ్యాలు, కమ్యూనిజాలు, రాచరికాలు, మతపర వ్యవస్థలు ఉన్నాయి. కొన్నింటిమధ్య తీవ్రమైన పరస్పర వివాదాలున్నాయి. పాశ్చాత్య కూటమికి అనుకూలమైనవి, వ్యతిరేకమైనవి, తటస్థమైనవి ఉన్నాయి. కొన్నింటిని బ్రిక్స్‌కు వ్యతిరేకంగా మార్చేందుకు పాశ్చాత్య శిబిరం ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇటువంటి పరిస్థితులు ఉన్నపుడు సంస్థలో కొంత పెళుసుతనం కూడా చోటుచేసుకోవటం సహజం. అటువంటపుడు చైనా గాని, మరొకరు గాని ఎంతో జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుంది. హైజాక్ చేసేందుకు ప్రయత్నించకపోవటం సరికదా, అవసరమైనపుడు కొంత రాజీ పడటం కూడా అవసరమవుతుంది. తమ కారణంగా సంస్థ విఫలమై, భంగపడిందనే నిందను తెచ్చుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. కనుక, బ్రిక్స్‌ను చైనా హైజాక్ చేయ గోరుకోదు, కోరుకున్నా అది వీలయేది కాదు.
ఇదంతా చెప్పుకున్న తర్వాత, చైనా ఎందుకు హైజాక్ చేయజూడదో అర్థం చేసుకునేందుకు మరో బలమైన కారణం ఉంది. అసలు ఈ హైజాక్ చర్చ తలెత్తటానికి కారణం బ్రిక్స్ దేశాలన్నింటిలో చైనా అత్యంత శక్తిమంతమైనది కావటం. సాధారణంగా ఏ సంస్థలలోనైనా శక్తిమంతుడిది ఎంతోకొంత ఆధిక్యతవటం మామూలే. నాటోలో అమెరికాది, ‘సార్క్’లో ఇండియాది అయినట్లు. అయితే, సహజ శక్తి కారణంగా కొంత ఆధిక్యత ఉండటం వేరు, దాని ఆధారంగా ఆధిపత్యం చలాయించటం వేరు. ఈ సూత్రీకరణ ప్రకారం బ్రిక్స్‌లో శక్తిమంతమైన చైనా ఆధిపత్యాన్ని చలాయించి హైజాక్ చేయవచ్చుననే సందేహాలు కలగటం సహజం. కాని, చైనా ఆ పని చేయజూడదని, చేయటం సాధ్యం కూడా కాదని పైన కొన్ని చెప్పుకొన్న తర్వాత, మరొకటి చూడటం అవసరం.
కాలం వాళ్లదైనప్పుడు...
‘బ్రిక్స్’తో నిమిత్తం లేకుండా చైనాకు తనదైన దీర్ఘకాలిక వ్యూహం ఒకటి ఉన్నది. అందులో మొదటి భాగం, తన స్వీయచరిత్రలోని అవమానాల శతాబ్దం (1839 నల్లమందు యుద్ధాల నుంచి 1949 విప్లవం వరకు) నుంచి, ఆ తర్వాత శతాబ్ద కాలాన్ని (2049 వరకు) ‘పునరుజ్జీవన శతాబ్దంగా నిర్వచించుకున్నందున, సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించటం. ఇది మొదటి భాగం కాగా, ఇది నెరవేరాలంటే అందుకు భంగం కలిగించగలæఅమెరికన్ కూటమి ఆధిక్యత నియంత్రణలో ఉండటం, వీలైనంత బలహీనపడుతూ పోవటం అవసరం.
అట్లా జరగాలంటే ఆ కూటమికి బయటి దేశాలు వీలైనంత ఒకటి కావాలి, వీలైనంతగా అభివృద్ధి చెందాలి, వీలైనంత స్వతంత్రంగా వ్యవహరించాలి, పాశ్చాత్యులకు ఆధిపత్యం గల సంస్థలపై, రంగాలపై ఆ కూటమి నియంత్రణ వీలైనంత తగ్గుతూపోవాలి. ఆ విధంగా పాశ్చాత్య శిబిరం చాపకింద నీరు చేరుతుండాలి. ఇది దీర్ఘకాలిక వ్యూహం. అందుకు బ్రిక్స్ కూడా ఒక సాధనమవుతుంది.
చైనా చక్రవర్తుల వేల సంవత్సరాల యుద్ధ నీతుల నుంచి, సున్‌జూ యుద్ధ వ్యూహాల నుంచి అనేకం నేర్చుకున్న ఆధునిక నాయకత్వాలు, తమ దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరటం ప్రధానమనుకుంటారు. అందుకవసరమైన నేర్పును, ఓర్పునంతా చూపుతారు. అవసరమైతే తగ్గి ఉంటారు. అంతే తప్ప, తాము శక్తిమంతులం కదా అని తొందరపడి బ్రిక్స్‌ను హైజాక్ చేయజూడరు. తమ దీర్ఘకాలిక సాధనాన్ని భంగపరచరు. ముఖ్యంగా చరిత్ర గమనం తమ వెంట ఉందని నమ్మినపుడు.
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


