పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన | Mallikarjun Kharge Unhappy Over Congress Leaders Response To Purification Row In Uttarakhand, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన

Aug 21 2026 7:47 AM | Updated on Aug 21 2026 9:52 AM

Kharge Purification Row Congress Chief Questions Silence of Party Seniors

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన సభ తర్వాత జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించిన ఈ ఘటనపై పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో బహిరంగంగా స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశం బయట రాజకీయ వివాదానికే పరిమితం కాకుండా.. ఇప్పుడు కాంగ్రెస్‌ అంతర్గత చర్చలోనూ చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

అలాగే సామాజిక న్యాయం, కుల వివక్షకు సంబంధించిన అంశాలపై పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించాలని ఆయన కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే శుద్ధీకరణ అంశాన్ని లేవనెత్తారు. తనకు మద్దతు తెలపని సీనియర్‌ నాయకులపై ఖర్గే సరదాగా ఒక వ్యాఖ్య చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘బాగా రాసేవారు, చూడటానికి బాగుండేవారు ఈ విషయంలో గట్టిగా గళం విప్పలేదని ఖర్గే ఆవేదన చెందారు’ అని వెల్లడించాయి.

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాత్రం కాంగ్రెస్‌ ఇప్పటికే ఈ ఘటనను ఖండించిందని చెప్పారు. ఈ ఘటన ‘ఆమోదయోగ్యం కాదు, ఖండించదగినది’ అని ఆయన పేర్కొంటూ, ఇది బీజేపీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. అయితే సమావేశంలో ఉన్న నేతల ప్రకారం, ఖర్గే మాత్రం పార్టీ స్పందనపై పూర్తిగా సంతృప్తి చెందినట్లు కనిపించలేదని సమాచారం. అంటే ఈ ఘటనను కేవలం ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక రాజకీయ వివాదంగా వదిలేయకుండా.. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అసలేం జరిగింది?
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రామలీలా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. 2027 ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాల్లో భాగంగా ఈ సభ జరిగింది. ఆయన సభ ముగిసిన రెండు రోజుల తర్వాత, అదే రామలీలా మైదానంలో ఖర్గే ప్రసంగించిన వేదికను కొందరు వ్యక్తులు ‘శుద్ధీకరణ హవన్‌’ పేరుతో శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్‌ సేనకు సంబంధించిన వారుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఖర్గే స్వయంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఏ కులం లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించలేదని, ప్రజలకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించానని చెప్పారు. తన ప్రసంగం తర్వాత వేదికకు ‘శుద్ధీకరణ’ చేయడం తనను అవమానానికి గురిచేసిందని, అంటరానితనం వల్ల కలిగే బాధను గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ వైఖరి ఏంటి..
ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా ఈ ఘటనను విచారకరమని పేర్కొంటూ, బీజేపీకి దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖర్గే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తామని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానంగా కాకుండా కుల వివక్ష, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి అంశాలతో ముడిపెట్టింది. ఈ అంశాన్ని రాజకీయంగా కూడా బలంగా ప్రస్తావిస్తోంది.

ఇదీ చదవండి: డీకే ఎదుట విజయ్‌ సరెండర్‌.. డీఎంకేకు చిక్కిన అస్త్రం

మొత్తానికి.. హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఒక వేదికను శుభ్రం చేసే కార్యక్రమంగా మొదలైనా.. అది ఇప్పుడు కుల వివక్ష, సామాజిక న్యాయం, రాజకీయ సిద్ధాంతాలపై పెద్ద చర్చగా మారింది. అంతేకాదు.. ఆ ఘటనపై బయట బీజేపీతో పోరాడుతున్న కాంగ్రెస్‌.. లోపల మాత్రం తన సొంత నేతల స్పందనపైనే అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నలు సంధించడం కొత్త రాజకీయ కోణాన్ని తెరపైకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement