డీకే ఎదుట విజయ్‌ సరెండర్‌.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం | DMK Targets CM Vijay stays silent On Mekedatu And Cauvery | Sakshi
Sakshi News home page

డీకే ఎదుట విజయ్‌ సరెండర్‌.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం

Aug 21 2026 7:16 AM | Updated on Aug 21 2026 7:22 AM

DMK Targets CM Vijay stays silent On Mekedatu And Cauvery

కావేరి నీళ్ల వివాదం మరోసారి దక్షిణాది రాజకీయాల్లో కాక రేపుతోంది. కర్ణాటక-తమిళనాడు మధ్య నీళ్ల పంచాయితీకి కేంద్రంగా మారిన మేకేదాటు డ్యామ్‌ అంశం.. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌ను చుట్టుముడుతోంది. మహాబలిపురంలో జరిగిన దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మేకేదాటు ప్రాజెక్టుకు గట్టిగా బ్యాటింగ్‌ చేస్తే.. అదే వేదికపై ఉన్న విజయ్‌ మాత్రం ప్రాజెక్టు పేరెత్తకుండానే ‘చట్టబద్ధమైన నీటి వాటా’ అంటూ జాగ్రత్తగా మాట్లాడారు. దీంతో అసలు విజయ్‌ స్టాండ్‌ ఏంటి? అన్న ప్రశ్నను డీఎంకే తెరపైకి తీసుకొచ్చింది.

‘కర్ణాటక సీఎం మేకేదాటుకు అనుకూలంగా బహిరంగంగా మాట్లాడుతుంటే.. తమిళనాడు సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?’ ఇదే ఇప్పుడు డీఎంకే ప్రధాన అస్త్రం. డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ విజయ్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. తమిళనాడు నీటి హక్కుల విషయంలో సీఎం మౌనం.. రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడటమే అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది డీఎంకే.

విజయ్‌ మౌనం.. డీఎంకేకు రాజకీయ అస్త్రం!
మేకేదాటు డ్యామ్‌ అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. తమిళనాడు రాజకీయాల్లో కావేరి సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం. రైతుల ప్రయోజనాలు, నీటి హక్కులు, కర్ణాటకతో పోరాటం.. ఈ మూడు అంశాల చుట్టూనే డీఎంకే తన రాజకీయ దాడిని పదును పెడుతోంది. గతంలోనూ మేకేదాటు విషయంలో విజయ్‌ వైఖరిని డీఎంకే తప్పుబట్టింది. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని పట్టుకుని ‘తమిళనాడు హక్కుల కోసం ఎవరు గట్టిగా నిలబడుతున్నారు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.

అయితే విజయ్‌ మాత్రం మరో వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మేకేదాటు పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఎగువ రాష్ట్రం చేపట్టే ఎలాంటి చర్యలూ దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను ప్రభావితం చేయకూడదని, అన్నీ చట్టపరమైన పరిధిలోనే జరగాలని స్పష్టం చేశారు. అంటే.. డీఎంకే కోరుతున్నట్టుగా కర్ణాటకపై నేరుగా రాజకీయ యుద్ధం చేయకుండా.. చట్టం, హక్కులు, నీటి వాటా అనే మూడు అంశాల చుట్టూ తన వైఖరిని పరిమితం చేశారు.

అసలు మేకేదాటు గేమ్‌ ఏంటి?
కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకేదాటు ప్రాజెక్టుతో బెంగళూరుకు తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆ రాష్ట్రం చెబుతోంది. ప్రతిపాదిత రిజర్వాయర్‌లో 5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని, మిగిలిన నీరు తమిళనాడుకు వెళ్తుందని డీకే శివకుమార్‌ అంటున్నారు. కాగా, తమిళనాడుకు ఒక్క చుక్క కూడా నష్టం చేయం అన్నది కర్ణాటక వాదన. కానీ తమిళనాడు అనుమానం మాత్రం అక్కడే మొదలవుతోంది. నీరు ఎప్పుడు విడుదల చేస్తారు? ఎంత విడుదల చేస్తారు? కరువు వచ్చినప్పుడు కర్ణాటక తన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే.. దిగువన ఉన్న తమిళనాడు పరిస్థితి ఏంటి?. అదే మేకేదాటు వివాదానికి అసలు కేంద్రబిందువు.

కావేరిపై ఇప్పటికే టెన్షన్‌!
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో.. తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు విడుదల చేయాలని కావేరి వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ ఆదేశించింది. ఈ ఆదేశాలపై కర్ణాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అటు తమిళనాడు మాత్రం ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement