అన్నామలై.. మ‌రో ముంద‌డుగు | Annamalai to Establish Political Training Centre in Coimbatore | Sakshi
Sakshi News home page

సొంత‌దారిలో ముందుకెళుతున్న అన్నామ‌లై

Oct 5 2026 6:04 PM | Updated on Oct 5 2026 6:23 PM

Annamalai to Establish Political Training Centre in Coimbatore

సాక్షి, చెన్నై:  త‌మిళ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు 'వి ది లీడర్స్ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు కే. అన్నామలై సొంత దారిలో ముందుకు సాగుతున్నారు. వివిధ కార్య‌క‌లాపాల‌తో ప్ర‌జ‌లతో మ‌మేకం అయ్యేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా యువ‌త‌, మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేలా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల  15న కోయంబత్తూరులో అబ్దుల్‌ కలాం సెంటర్‌ ఫర్‌ ఎథిక్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ అనే రాజకీయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అన్నామలై ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, రాజకీయ పాఠాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని, మొదటి రోజు 100 మంది మహిళలు ఈ శిక్షణా కార్యక్రమంలో చేరనున్నారని అన్నామలై తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. వి ది లీడర్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒక ప్రత్యేక సామాజిక అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ నెలను మహిళల భద్రత, సాధికారత’ థీమ్‌తో నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను గుర్తించి, వారికి కామరాజ్‌అవార్డును అందజేసి అన్నామలై సత్కరిస్తారు.  మహిళల ఆర్థిక పురోగతికి మద్దతుగా అక్టోబర్‌ మూడో వారంలో కృష్ణగిరి జిల్లాలో 5,000 మంది మహిళలతో కూడిన స్వయం సహాయక బృందాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు.

నాలుగేళ్లలో 21,397 పోక్సో కేసులు
త‌మిళ‌నాడులో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని అన్నామ‌లై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 2020 – 2024 మధ్య కాలంలో పోక్సో, లైంగిక దాడి, వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, కిడ్నాప్‌ వంటి నేరాల కింద మొత్తం 26,145 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 21,397 కేసులు పోక్సో చట్టం కింద నమోదైన కేసులు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

'ఆమె' ఇప్ప‌టికీ వెనుకంజే
పరిపాలన, నిర్ణయాధికార పదవుల్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందని అన్నామ‌లై పేర్కొన్నారు. త‌మ సంస్థ త‌ర‌పున 128 పేజీల సమగ్ర మహిళా విధాన పత్రాన్ని ఆయ‌న‌ విడుదల చేశారు. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 11.01 శాతం మాత్రమేనని తెలిపారు. లోక్‌సభలో 13.8 శాతం, కేంద్ర మంత్రివర్గంలో 5.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పారు. మంత్రివర్గంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడమే త‌మ‌ లక్ష్యమ‌న్నారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న సమాజాన్ని నిర్మించడమే త‌మ సంస్థ‌ ముఖ్య ఉద్దేశమని అన్నామలై పేర్కొన్నారు.

ఇదీ చ‌ద‌వండి: ఇండియా కూట‌మిలోకి టీవీకే

త్వ‌ర‌లో మార్కెట్‌లోకి పుస్తకం
తాను రాసిన పుస్త‌కం 'అన్‌ఫినిష్డ్ హోప్' త్వ‌ర‌లో మార్కెట్‌లో అమ్మకానికి రానుంద‌ని అన్నామ‌లై తెలిపారు. అమెజాన్ ద్వారా ముందుగానే పుస్త‌కాన్ని బుక్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన లింక్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ పుస్తకం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం 'వి ది లీడర్స్ ఫౌండేషన్' చేపట్టిన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామ‌ని చెప్పారు. అపార‌మైన వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ మ‌న దేశం సాధించాల్సిన ప్ర‌గ‌తి సాధించ‌లేద‌న్న భావ‌న‌తో తాను ఈ పుస్త‌కం రాసిన‌ట్టు అన్నామ‌లై వెల్ల‌డించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement