ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్‌ కీలక ప్రకటన | CM Vijay TVK joins INDIA bloc in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్‌ కీలక ప్రకటన

Oct 4 2026 8:23 AM | Updated on Oct 4 2026 8:23 AM

CM Vijay TVK joins INDIA bloc in Tamil Nadu

సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం(టీవీకే) కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరింది. చెన్నైలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశానికి టీవీకే తరఫున ఇద్దరు మంత్రులు  హాజరయ్యారు. వారికి కాంగ్రెస్‌ నాయకులు ఆహ్వానం పలికారు. ఇండియా కూటమిలో కొద్ది నెలల క్రితం వరకు తమిళనాట డీఎంకే కీలకంగా ఉంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకేకు  మద్దతివ్వడంతో డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలగింది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరుకాలేదు. టీవీకే కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. గత నెలలో తమిళనాట టీవీకే నేతృత్వంలో ‘మత సామరస్య సామాజిక న్యాయ విజయ కూటమి (సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌)’ ఆవిర్భవించింది. ఇందులో ఇండియా కూటమిలోని సీపీఎం, సీపీఐ మాత్రం చేరలేదు. ఈ పరిస్థితులలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో పోరాటాలకు ఇండియా కూటమి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో ఇండియా కూటమి సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీవీకే పార్టీ అధికారికంగా పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.

ఈ సమావేశానికి టీవీకే తరఫున మంత్రులు ఆధవ్‌ అర్జున, మరియా విల్సన్‌ హాజరై కూటమికి మద్దతు ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ తరపున రవీంద్రనాథ్, ఐయూఎంఎల్‌ తరపున అబూబకర్‌  తదితర కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. సీఈసీ 
రాజీనామా డిమాండ్‌తో పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. అనంతరం, మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలో టీవీకే చేరడం ప్రతిపక్ష ఐక్యతకు చారిత్రక రోజని వ్యాఖ్యానించారు. తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం మరింత ఆసక్తికరంగా మారుతుందని చెప్పారు.

ఓటర్ల జాబితా అంశంపై ఆందోళనలు
మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్‌పై ఇండియా కూటమి ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని కూటమి నిర్ణయించినట్లు ఠాగూర్‌ తెలిపారు. అక్టోబర్‌ 15న కూటమిలోని ఏడు పార్టీలకు చెందిన అగ్రనేతలతో భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు అక్టోబర్‌ 6న ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: విజయ​ టార్గెట్‌గా స్టాలిన్‌ బిగ్‌ అటాక్‌.. దెబ్బకు డిఫెన్స్‌లో టీవీకే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement