చట్టం చేస్తారా లేదా? | Andhra Pradesh High Court questions Chandrababu on BC reservations | Sakshi
Sakshi News home page

చట్టం చేస్తారా లేదా?

Oct 6 2026 4:33 AM | Updated on Oct 6 2026 4:33 AM

Andhra Pradesh High Court questions Chandrababu on BC reservations

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుకు హైకోర్టు ప్రశ్న

ఈనెల 28 డెడ్‌లైన్‌.. ఆలోగా చెప్పండి 

తమిళనాడు తరహాలో ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు? 

చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏం చేస్తున్నారు? 

ఈ అంశంపై ఇప్పటికే 6 వాయిదాలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం 

ఇక ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసిన హైకోర్టు 

ఏడాదిగా వాయిదాలతో కాలయాపన.. ఇక వైఖరి చెప్పాల్సిన పరిస్థితి 

బూటకపు జీవోలను ఇప్పటికే కొట్టేసిన హైకోర్టు

సుప్రీంకోర్టుకు వెళ్లడమూ డ్రామాయేనని తేలిపోవడంతో ఇరుకునపడ్డ బాబు 

బీసీ రిజర్వేషన్లపై 2025 నాటి కేసులో హైకోర్టు విచారణ

తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ నెల 28వ తేదీ డెడ్‌లైన్‌.. ఇదే చివరి అవకాశం. ఆ లోగా చెప్పాల్సిందే. – చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: బీసీలకు దక్కాల్సిన న్యాయమైన రిజర్వేషన్లను కేవలం కాగితాలకే పరిమితం చేస్తూ చట్టం ముందు చెల్లుబాటు కాని జీవోలను తెచ్చి బీసీలను వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఝలక్‌ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏడాదికాలంగా సమాధానం ఇవ్వకుండా వాయిదాలు కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోంది. కానీ ఇక జీవోలతో కాలయాపన కాకుండా.. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలుకు ఈనెల 28 వరకు హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. కౌంటర్‌ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం ఖంగుతిన్నది. 

స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తాజా ఆదేశం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఇక సుప్రీంకోర్టులో పోరాటం పేరుతో తప్పించుకోవడం సాధ్యం కాదు. బీసీలకు శాశ్వత రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొస్తారా? లేదా? అన్నది తేల్చాల్సిందే. బీసీలు అడుగుతున్నట్లు జీవోలు కాదు.. చట్టం కావాలి. హామీలు కాదు.. రాజ్యాంగ రక్షణ కావాలి.   

చట్టం చేస్తారా లేదా చెప్పాల్సిందే.. 
ఇంతకాలం ఈ కీలక అంశానికి సమాధానం ఇవ్వకుండా అటు బీసీలను, ఇటు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ, చెల్లని జీవోలతో 34 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్రభుత్వా­నికి హైకోర్టు ఆదేశం శరాఘాతమనే చెప్పాలి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టతనివ్వాల్సి ఉంటుంది.

 స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచి్చన జీవోలను హైకోర్టు కొట్టేయ­డంతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా ఆదేశం ఊహించని పరిణామమే. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం ఖాయమని తెలిసినా న్యాయ పోరాటం అంటూ బాబు డ్రామా­ను రక్తికట్టిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం ఇష్టం లేని బాబు చట్టం తెచ్చే అవకాశమే లేదని టీడీపీలోని బీసీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నారు.  

తూతూ మంత్రంగా కమిషన్‌.. రహస్యంగా నివేదిక
బీసీల కోసం ఏదో చేస్తున్నామనే రీతిలో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సమగ్ర కుటుంబ సర్వే చేయించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా అంతర్గతంగా కమిషన్‌ను అడ్డుకుంది. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరించి, వాటి ఆధారంగా బీసీ జనాభా, వెనుకబాటుతనాన్ని లెక్కించాల్సిన కమిషన్‌... ఆ  పని చేయకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ప్రణాళిక విభాగం సేకరించిన గణాంకాలపై ఆధారపడింది.

ఆ గణాంకాలనే తీసుకుని, తామే క్షేత్రస్థాయిలో వాటిని సేకరించినట్లు కలరింగ్‌ ఇచ్చింది. సమగ్ర సర్వే ఏదీ చేయకపోయినా కూడా ఏదో చేసినట్లు ఈ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచింది. దానిని హైకోర్టు అడిగినా బహిర్గతం చేయలేదు. అందులో రహస్యం ఏముందని నిలదీయడంతో హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇచ్చింది. రహస్యంగా ఉంచడంతో ప్రభుత్వంపై ప్రజలకు పలు అనుమానాలొచ్చాయి.  

క్యాబినెట్‌ ఆమోదించని నివేదికతో బీసీ రిజర్వేషన్లా? 
విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నను సంధించింది. అసలు రాజీవ్‌ రంజన్‌ కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకునే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారా? అని ప్రశి్నంచింది. కమిషన్‌ మొత్తం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని, కొంత భాగాన్నే తీసుకున్నామని ప్రభు­త్వం చెప్పింది. పైపెచ్చు సదరు కమిషన్‌ నివేదికను ఇంకా ఆమోదించలేదని చెప్పింది. మరి మొత్తం నివేదికను కాకుండా కొంత నివేదికనే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు? క్యాబినెట్‌ ఆమోదించని నివేదిక ఆధారంగా బీసీలకు చాలీచాలని రిజర్వేషన్లు ఎందుకు ఇచి్చనట్లు? దీనికి ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు.  

డొల్ల కమిషన్‌ అని తేల్చిన ధర్మాసనం
బీసీల సాధికారిత విషయంలో చిత్తశుద్ది ఉంటే, చంద్రబాబు ఆ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేసి, దానిపై మేధావుల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఉండేవారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా చట్టం చేసి కేంద్రానికి పంపేవారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి ఉండేవారు. అయితే చంద్రబాబు ఇదేమీ చేయకుండా చెల్లని జీవోలను తెచ్చి బీసీలను వంచించారు. అంతే కాదు, బీసీ రిజర్వేషన్ల కల్పనకు రాజీవ్‌ రంజన్‌ కమిషన్‌ వద్ద ఎలాంటి డేటా లేదని హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది. దీంతో ఆ కమిషన్‌ డొల్ల కమిషన్‌ అని తేలిపోయింది. హైకోర్టు ఆక్షేపించినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ డొల్ల కమిషన్‌ గడువును మళ్లీ పొడిగించింది.  

ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలు
బీసీ రిజర్వేషన్ల విషయంలో వాస్తవాలు కోర్టు ముందుంచేందుకు పిటిషన్లు దాఖలు చేసిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎదురు దాడి చేసింది. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న దానిపై హైకోర్టు ఎక్కడ ప్రశి్నస్తుందో.. అందుకు తామెక్కడ వాస్తవం చెప్పాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో పిటిషనర్ల అర్హతలపై ప్రభుత్వం సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తింది. ముఖ్యంగా చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై హైకోర్టుకు సహకరించేందుకు వచ్చిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, జాతీయ బీసీ కమిషన్‌ పూర్వ చైర్మన్, ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్యను లక్ష్యంగా చేసుకుంది.

సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు 2025లో దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను రెండో పిటిషనర్‌గా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును ఈశ్వరయ్య కోరితే, దాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అనుబంధ పిటిషన్‌ దాఖలుపై ఈశ్వరయ్య అర్హతలు ప్రశి్నంచిన ప్రభుత్వం, ఆయన పిటిషనర్‌గా చేరితే తమకు వచి్చన నష్టం ఏంటో కోర్టుకు చెప్పలేదు. బీసీల విషయంలో జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తున్న ఈశ్వరయ్య తాను కోర్టు ముందు వాస్తవాలను ఉంచేందుకే వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు.  

బాబు మోసాలను బయటపెడతారనే.. 
గత విచారణ సమయంలో ఈశ్వరయ్యపై ఓ ప్రభుత్వ న్యాయవాది దురుసుగా మాట్లాడారు. బీసీల విషయంలో చంద్రబాబు మోసాలను బయటపెడుతున్న ఈశ్వరయ్య కోర్టులో కూడా ఎక్కడ వాటిని బయటపెడతారోనని భయపడుతోంది. అయితే పలు అంశాలపై న్యాయస్థానం లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. దీంతో చివరకు న్యాయస్థానం ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యానికి సముఖత వ్యక్తం చేసింది. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ 31బీ ప్రకారం సంబంధిత చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది.    

తమిళనాడు తరహాలో రిజర్వేషన్లకు ఏం చేస్తున్నారు?
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు  
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి  జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అందుకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా తెలియచేయాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఆరుసార్లు సమయం తీసుకున్న నేపథ్యంలో కౌంటర్‌ దాఖలుకు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌ భానుమతి తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.   

ఆర్టీకల్‌ 342ఏ(3)ను అమలుచేయాలి 
రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 342ఏ(3) ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సామాజిక–ఆర్థిక సంక్షేమ చర్యల కోసం సామాజికంగా వెనుకబడిన తరగతుల జాబితాను రూపొందించి నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ ఏపీ విభాగం గౌరవాధ్యక్షుడు ఆలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2023లో ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను వెంటనే పూర్తి చేసి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ సర్వే ఫలితాలను వీలైనంత త్వరగా ప్రచురించాలని ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు.

అంతేకాక తమిళనాడు మాదిరిగా స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగంలోని అధికరణ ఆర్టీకల్‌ 31బి ప్రకారం సంబంధిత చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి సత్వర చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.

కాగా, ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, అఖిల భారత వెనుకబడిన తరగతుల ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగల ఈశ్వరయ్య ఇటీవల ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బీసీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. అయితే  ఈ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.  

ఇదేనా సర్కార్‌ చిత్తశుద్ధి 
‘‘కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కోర్టు ఆరుసార్లు సమయం ఇచ్చింది. ,అయినా కూడా ఇప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయలేదు. బీసీల విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇది  తెలియచేస్తోంది. మేము దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈశ్వరయ్య రెండో పిటిషనర్‌గా చేరితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం  లేదు.  అయినా కూడా ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం విస్మయపరుస్తోంది’’. 
– పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు

చట్టం చేయడం మినహా మరో మార్గం లేదు
బీసీలకు న్యాయమైన రిజ
ర్వేషన్లు దక్కాలంటే చట్టం చేయడం మినహా మరో మార్గం లేదు. చట్టాలు చేసేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం ఎప్పుడో వెసులుబాటునిచ్చింది. ఇటీవలి ధర్మాసనం ఉమ్మడి తీర్పు కేవలం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకే పరిమితమైంది. ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలకు, నా ఈ వ్యాజ్యానికి ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మాత్రమే కోరడం లేదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో కూడా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కోరుతున్నాం. అంతేకాక ప్రభుత్వం ఏర్పాటుచేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ వద్ద ఎలాంటి డేటా లేదని ఇటీవలి ఉమ్మడి తీర్పులో ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.

అసలు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.  బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.  సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించకుండా చట్ట ప్రకారం చెల్లని విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇంటింటికెళ్లి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తేనే బీసీ లెక్కలు తేలతాయి. తెలంగాణలో కూడా ఇలాగే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.  నేను జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశాను.

బీసీల వెనుకబాటుతనం, స్థితిగతులతో పాటు చట్టపరమైన అంశాలపై చాలా అవగాహన ఉంది.  ఈ నేపథ్యంలో కోర్టుకు వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యంలో రెండో పిటిషనర్‌గా చేరాలని నిర్ణయించుకున్నాను. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకించడం దురదృష్టకరం. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు.  బీసీల సంక్షేమ కోసమే పోరాటం చేస్తున్నాను.  చట్టం చేసి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు తమిళనాడు తరహాలోనే స్థానిక సంస్థలు, విద్యా, ఉపాధి అవకాశాల్లో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాం.  చట్టం చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడం లేదు.  – సీనియర్‌ న్యాయవాది వంగల ఈశ్వరయ్య వాదనలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement