ఢిల్లీ: దేశంలో ఉప ఎన్నికల సందడి నెలకొననుంది. అక్టోబర్ 6న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో ఐదు అసెంబ్లీ స్థానాలు కాగా.. ఒకటి లోక్‌సభ స్థానం. తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, పుదుచ్చేరిలో ఒక అసెంబ్లీ స్థానం, అసోంలో ఒక లోక్‌సభ స్థానానికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆరు స్థానాలకు రేపు జరగనుండగా.. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
తమిళనాడు.. రాష్ట్రంలోని మదురంతకం (ఎస్సీ), ధారాపురం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు అప్పటి ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలు తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వానికి కీలక రాజకీయ పరీక్షగా మారాయి.
పశ్చిమ బెంగాల్.. హైప్రొఫైల్ నందిగ్రామ్, రెజీనగర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నందిగ్రామ్ సీటు సీఎం సువేందు అధికారి రాజీనామాతో ఖాళీ కాగా.. రెజీనగర్ స్థానం హుమాయున్ కబీర్ రాజీనామాతో ఖాళీ అయింది. ఈ రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
పుదుచ్చేరి.. తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్. రంగసామి ఈ నియోజకవర్గానికి రాజీనామా చేసి మరో స్థానాన్ని కొనసాగించడంతో ఈ సీటు ఖాళీ అయింది.
అసోం.. నాగావ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
కాగా, ప్రస్తుతం తమిళనాడులోని మదురంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ప్రత్యేక ఆసక్తిని రేపుతున్నాయి. రెండు స్థానాల్లోనూ టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య బహుముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్వయంగా వరుసగా ప్రచారం నిర్వహించడం ఈ ఎన్నికలకు ప్రాధాన్యం పెంచింది. రెండు సీట్లను గెలిస్తే అసెంబ్లీలో టీవీకే బలం పెరగనుండటంతో.. ఫలితాలు విజయ్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలక సంకేతంగా మారే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రామ్, రెజీనగర్ ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాయ్ రాథ్‌కు సీనియర్ నేతలు ప్రచారం చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ కూడా చివరి దశలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెజీనగర్‌లో టీఎంసీ, కాంగ్రెస్, ఏజేయూపీ, తిరుగుబాటు టీఎంసీ వర్గం మధ్య పోటీ సాగుతోంది. ఓటర్ల జాబితా SIR అంశం కూడా ఈ ఎన్నికల రాజకీయ చర్చలో కీలకంగా మారింది. అందువల్ల ఆరు స్థానాల్లో ఫలితాలు కేవలం ఖాళీ సీట్ల భర్తీగా కాకుండా.. ఆయా రాష్ట్రాల్లో పార్టీల బలాబలాలకు, నేతల రాజకీయ ప్రతిష్ఠకు పరీక్షగా మారాయి.
ఇదీ చదవండి: బెంగాల్‌లో ట్విస్ట్.. తిరుగుబాటు నేతలకు మమత గట్టి వార్నింగ్


