విజయ్‌ సర్కార్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్‌ | mk stalin dmk to file rs 1 crore defamation case against tvk | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్‌

Oct 5 2026 7:40 PM | Updated on Oct 5 2026 8:04 PM

mk stalin dmk to file rs 1 crore defamation case against tvk

చెన్నై: టీవీకేకు మద్రాస్‌ హైకోర్ట్‌ షాకిచ్చింది. గ్రానైట్‌ వ్యాపారి ఆర్ వీరమణికి సంబంధించిన పోక్సో కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన  (టీవీకే) నేతలతో పాటు  ఆ పార్టీ ఐటీ విభాగంపై పరువునష్టం దావా వేయడానికి DMKకు అనుమతి ఇచ్చింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తరఫున దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవతి ఈ ఆదేశాలు జారీ చేశారు.

డీఎంకే తన పిటిషన్‌లో  టీవీకే నేతలు ఆధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్‌తో పాటు టీవీకే ఐటీ విభాగాన్ని ప్రతివాదులుగా పేర్కొంది. వీరమణికి సంబంధించిన పోక్సో కేసులో డీఎంకే తన గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోలేదని, ఆయనకు రక్షణ కల్పించిందని టీవీకే నేతలు, ఆ పార్టీ ఐటీ విభాగం ఆరోపించాయని డీఎంకే పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనివాదించింది.

ఈ వ్యవహారంలో డీఎంకే రూ.1.01 కోట్ల నష్టపరిహారం కోరింది. అంతేకాకుండా, తమపై మరిన్ని పరువునష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్, టీవీకే ఐటీ విభాగాన్ని ఆదేశించాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే చేసిన ఆరోపణలకు సంబంధించిన పోస్టులు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టును కోరింది.  

వీరమణిపై ఫిర్యాదు 2025 అక్టోబర్ 6న అందగా, మరుసటి రోజే అంటే అక్టోబర్ 7న పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డీఎంకే తన పిటిషన్‌లో తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారని, కేసు దర్యాప్తులో తమ ప్రభుత్వం లేదా పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని డీఎంకే వాదించింది.

అయితే, ఈ కేసులో పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయడానికి ప్రయత్నించగా, పోక్సో కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తును తాజాగా కొనసాగించాలని ఆదేశించింది. అనంతరం దర్యాప్తు చట్టప్రకారం కొనసాగిందని డీఎంకే పేర్కొంది. కేసులో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని, నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదా కుమ్మక్కు లేదని కూడా పార్టీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, టీవీకే నేతల తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణన్ ఈ దావా నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులుగా అధికారిక హోదాలో తమపై కేసు వేస్తున్నందున, సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 80(1) ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వాదించారు. ఆ నోటీసు ఇవ్వకుండా నేరుగా దావా వేయడం చట్టపరంగా సాధ్యం కాదని తెలిపారు.

వీరమణి కేసు నేపథ్యం

జెమ్ గ్రానైట్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఆర్. వీరమణిపై మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆయనను కఠినమైన గూండాస్ చట్టం కింద కూడా నిర్బంధించారు. ఇప్పటివరకు వీరమణిపై నాలుగు కేసులు నమోదైనట్లు సమాచారం. వాటిలో మూడు పోక్సో చట్టం కింద ఉండగా, మరో కేసు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినది. ఆయనకు సంబంధించిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీరమణితో పాటు ఆయనకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి, మహేంద్ర సిమ్హన్ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసి న్యాయ రిమాండ్‌కు పంపారు. అనంతరం చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఎ. అమల్‌రాజ్ ఆదేశాల మేరకు గూండాస్ చట్టం కింద నిర్బంధించిన 14 మందిలో వీరమణి, శాంతి, మహేంద్ర సిమ్హన్ కూడా ఉన్నారు.

కాగా ఈ కేసు అంశమై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఈ నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 

 

ఇదీ చదవండి: 30 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement