ఈక్వాటూర్: కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి నదిలో ఎదురెదురుగా వెళుతున్న పడవలు దురదృష్టవశాత్తు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం నిన్న ఆదివారం సాయంత్రం ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలేలా ప్రాంతం సమీపంలో చోటుచేసుకుంది. రెండు మోటారు కలిగిన చెక్క పడవలు ఢీకొన్నాయని ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. అయితే పడవలు ఎందుకు ఢీకొన్నాయనే విషయం వెంటనే స్పష్టంగా తెలియలేదని పేర్కొన్నారు. కాగా రాత్రి వేళ నదిలో ప్రయాణించడం వల్ల గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయని మంత్రి తెలిపారు.
ఒక పడవ వాయువ్య ప్రాంతంలోని ఉబాంగి నుంచి రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా, మరో పడవ కిన్షాసా నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని లుకోలేలా వైపు ప్రయాణిస్తోంది. ప్రమాదం అనంతరం ప్రాణాలతో బయటపడినవారిని, మృతదేహాలను గుర్తించేందుకు, వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అయితే ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం , ఉబాంగి నుంచి తిరిగి వస్తున్న పడవలో పెద్ద మొత్తంలో సరుకులు ఉండటంతో అది అధిక భారంతో ప్రయాణిస్తోందని ఈ పడవ కిన్షాసా నుంచి వస్తున్న మరో పడవను ఢీకొన్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైద్య విభాగంలో ముగ్గురికి నోబెల్


