సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు . మూడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు అసెంబ్లీ స్థానాలు, అలాగే ఒక లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో మదురాంతకం, ధారాపురం.. పశ్చిమ బెంగాల్‌లో నందిగ్రామ్, రేజీనగర్.. పుదుచ్చేరిలో తట్టాంచావడి అసెంబ్లీ స్థానాలకు.. అలాగే అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నవి తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం స్థానాలు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రెండు స్థానాలూ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు.
ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మదురాంతకంలో మారగతం కుమారవేల్, ధారాపురంలో పి. సత్యబామ అన్నాడీఎంకే తరఫున గెలిచారు. అనంతరం వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ పార్టీలో చేరారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇక్కడ టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, సీపీఐ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మదురాంతకంలో 2,12,639 మంది ఓటర్లు, ధారాపురంలో 2,22,406 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ ఎంత? అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే బలం పెరిగిందా? అన్నది ఈ ఫలితాలతో కొంతవరకు అంచనా వేయొచ్చు.
నందిగ్రామ్‌లో బీజేపీకి తొలి పరీక్ష
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్ స్థానాల్లో కూడా ఇవాళే పోలింగ్ జరగనుంది. ఇటీవలే రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొత్త ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికల పరీక్షగా మారాయి. ముఖ్యంగా నందిగ్రామ్ ఫలితం ఆసక్తికరంగా మారింది. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. అనంతరం భవానీపూర్ స్థానాన్ని కొనసాగించడంతో నందిగ్రామ్ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు అక్కడ జరిగే ఉప ఎన్నిక సువేందు అధికారి వ్యక్తిగత ప్రభావానికి కూడా పరీక్షగా మారింది. రేజీనగర్ స్థానంలోనూ బహుముఖ పోటీ నెలకొంది. అధికార బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.
నాగావ్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
అసోంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక మరో కీలక పోరు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ప్రద్యుత్ బోర్దొలోయ్ తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.
నాగావ్‌లో సుమారు 19.02 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,339 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి దేవాశిష్ శర్మ, ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్, కాంగ్రెస్ అభ్యర్థి శిబామణి బోరా మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ఈ సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేక కాంగ్రెస్ తన పాత స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పుదుచ్చేరిలోనూ బరిలో..
పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్. రంగసామి రెండు నియోజకవర్గాల నుంచి గెలిచి ఒక స్థానాన్ని కొనసాగించడంతో తట్టాంచావడి సీటు ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
9న ఫలితాలు
ఆరు స్థానాలకు ఇవాళ పోలింగ్ ముగిసిన తర్వాత అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు ఒక సంకేతంగా నిలవనున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి తొలి ఎన్నికల పరీక్ష కావడంతో మదురాంతకం, ధారాపురం ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: సర్ నిరసనలు.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్


