శంషాబాద్‌లోని తొండుపల్లిలో జరిగిన ఓబీసీ గర్జన సభలో ప్రసంగిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్. చిత్రంలో మధుయాష్కీ, దానం, వంశీచంద్, వీహెచ్ , వీర్లపల్లి శంకర్, పొన్నం ప్రభాకర్ తదితరులు
అందుకు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మద్దతు ఇస్తారు
బీసీల హక్కులు సాధిస్తాం.. అవసరమైతే లాక్కుంటాం
కాంగ్రెస్ ఓబీసీ గర్జన సభలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
శంషాబాద్: ‘ఘంటా పథంగా ఎప్పుడూ చెబుతుంటాను.. మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయి తీరతాడు. ఇందుకు రాహుల్‌గాంధీ మద్దతు ఇస్తారు. రేవంత్‌రెడ్డి కూడా మద్దతు ఇస్తారు. ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం రాహుల్‌గాందీ, మల్లిఖార్జున ఖర్గే ఇచ్చే ధైర్యమే..’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. శంషాబాద్ తొండుపల్లిలో ఆదివారం టీపీసీసీ ఓబీసీ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఓబీసీ గర్జన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీజేపీ దద్దమ్మలు మాట్లాడరు..
‘అన్ని వర్గాల మద్దతుతో మాకు రావాల్సిన హక్కులను సాధిస్తాం.. అవసరమైతే లాక్కుంటాం. ఆనాడు పీవీ నర్సింహారావు, చెన్నారెడ్డి లాగా చరిత్రలో నిలిచిపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి కులగణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపారు. కానీ రాష్ట్రంలో బీజేపీ దద్దమ్మలు మాత్రం బీసీ రిజర్వేషన్లపై ఏనాడూ నోరు మెదపరు. కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా 57% శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. రానున్న రోజుల్లో మంత్రి మున్సిపల్, కార్పొరేషన్, మంత్రి పదవుల్లో కూడా బీసీ రిజర్వేషన్ పెంచుతాం. రానున్న ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయం. అప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన అవసరం కూడా లేదు. బీసీ పోరాట యోధుడు రాహుల్‌గాం«ధీ..’ అని మహేశ్‌గౌడ్ అన్నారు.
ఓబీసీలు ఉద్యమించాలి..
బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఎవరూ తీసుకోలేదని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. జనగణనలో కులగణన కూడా చేసేలా ఓబీసీలు ఉద్యమించాలని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయాల్సిన అవసరముందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకాని ఫిరాయింపుదారులు
బీసీ గర్జన సభకు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కానీ ఇటీవల హైకోర్టు అనర్హత వేటు వేసిన దానం నాగేందర్ సభకు హాజరై మాట్లాడారు.


