దుండగుల గుండెల్లో వణుకు పుట్టాలి  | Create fear in minds of goons for womens safety in Delhi-NCR | Sakshi
Sakshi News home page

దుండగుల గుండెల్లో వణుకు పుట్టాలి 

Oct 6 2026 5:54 AM | Updated on Oct 6 2026 5:54 AM

Create fear in minds of goons for womens safety in Delhi-NCR

పోలీసుల తీరు నేరగాళ్లకు సింహస్వప్నం కావాలి 

మహిళల భద్రతపై సుమోటో కేసులో సుప్రీంకోర్టు సీరియస్‌ 

రాత్రి 11 గంటలకైనా మహిళలు నిర్భయంగా ప్రయాణించేలా చూడాలి 

సీసీటీవీల పర్యవేక్షణపై ఢిల్లీ పోలీసులకు కీలక సూచనలు

4 కీలక అంశాలపై నివేదికకు ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, అమ్మాయిల భద్రతపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాత్రి వేళల్లో సైతం మహిళలు సురక్షితంగా మెట్రో రైళ్లలో, రహదారులు, వీధుల్లో ప్రయాణించే క్షేమదాయక వాతావరణం ఉండేలా చూడాలని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలపై సుమోటోగా స్వీకరించిన జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది. 

‘‘ఢిల్లీలో తరచూ వెలుగుచూస్తున్న అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు చూస్తుంటే రాజధాని మహిళలకు ఏమాత్రం రక్షణ ఇవ్వట్లేదనే భావన కల్గుతోంది. ఇకనైనా దుండగుల గుండెల్లో వణుకు పుట్టేలా పోలీసుల కఠిన చర్యలు తీసుకోవాలి. నేరాలు జరిగాక దర్యాప్తు చేయడం కాదు. అవి జరగకుండా ముందస్తుగా నిరోధించడం అత్యంత కీలకం. సీసీటీవీల నిరంతర పర్యవేక్షణ, చీకటిగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటు తదితర భద్రతాపరమైన ఆడిట్‌ను 4 వారాల్లోగా పూర్తి చేయాలి’’అని ధర్మాసనం ఆదేశించింది.  

సవాల్‌గా తీసుకుని పనిచేయండి.. 
‘‘కఠిన చర్యల విషయంలో మమ్మల్ని ఏమాత్రం నిరాశపర్చకండి. పరిష్కారం చూపి సమస్యను తుదముట్టించండి. లైంగిక వేధింపుల బారినపడుతున్న ప్రతి మహిళ, బాలిక మన సోదరి, తల్లే. ఈ ఉదంతాలు పోలీస్‌ విభాగానికి అతిపెద్ద సవాల్‌ విసురుతున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపాల్సిందే. వీటిని సవాల్‌గా తీసుకుని పనిచేయండి’’అని జస్టిస్‌ పార్ధివాలా పోలీసులకు సూచించారు. ‘‘తప్పు చేద్దామని అనుకునే వాళ్ల మనసుల్లో భయం పుట్టేలా చేయాలి. ఇప్పుడేమైనా చేస్తే చచి్చపోతాం అనే భయం వారిలో ఉండాలి. 

అలాంటి భయం గనక మీరు కల్పించలేకపోతే ఇలాంటి నేరాలు జరక్కుండా నివారించడం చాలా కష్టమవుతుంది’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భద్రతా చర్యలు కేవలం కాగితాల మీదే చూపిస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో పటిష్ట నిఘా అవసరమని పోలీసు అధికారులకు కోర్టు చురకలంటించింది. సీసీటీవీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకోకుండా నెట్‌వర్క్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా 24 గంటలూ నిరంతరం పర్యవేక్షించినప్పుడే నేరాలను అరికట్టగలం. 

బస్టాండ్‌లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, పబ్లిక్‌ పార్క్‌లు, పాఠశాలలు, కళాశాలల వద్ద ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలు, వీధి దీపాలు, భద్రతా సిబ్బంది మోహరింపుపై సమగ్ర నివేదిక సమర్పించండి’’అని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు ధర్మాసనం ఆదేశించింది. ‘‘నేరస్తుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించండి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి. రాత్రి 11 గంటల సమయంలోనూ రోడ్డు మీద ప్రయాణిస్తున్నా, మెట్రోలో వెళ్తున్నా మహిళలకు పూర్తి భద్రతా భావం కలిగేలా చూడాల్సిన పూర్తి బాధ్యత మీదే’’అని పోలీసులకు ధర్మాసనం కర్తవ్యబోధ చేసింది. ‘‘పబ్లిక్‌ పార్క్‌లలో సరైన లైట్లు, సెక్యూరిటీ ఉండట్లేదు. ఇవి అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి మార్చాలి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. 

కలవరపెడుతున్న ఆ 4 ఘటనలు .. 
ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో తాజా రేప్‌ ఉదంతాల కేసుగా ఈ సూమోటో కేసును ధర్మాసనం విచారిస్తోంది. ముఖ్యంగా రాజధానిలో జరిగిన నాలుగు దారుణ ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీలోని ఆస్తా కుంజ్‌ పార్కులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనతోపాటు లేడీ శ్రీరామ్‌ ఉమెన్స్‌ కాలేజీ విద్యార్థినులు ఎదుర్కొంటున్న వరుస లైంగిక వేధింపుల ఘటనలనూ కోర్టు ప్రస్తావించింది. స్వరూప్‌ నగర్‌లో ఓ టీనేజ్‌ బాలికను ఆగంతకులు సామూహిక అత్యాచారంచేశాక చంపి పొలాల్లో పడేశారు. 

గ్రేటర్‌ నోయిడా నుంచి ఢిల్లీకి వచ్చిన బాలికను ఒక స్లీపర్‌ బస్సు డ్రైవర్, కండక్టర్‌ 47 కిలోమీటర్లు బస్సులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసుల నిఘా వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టు సహాయకుడు(అమికస్‌ క్యూరీ)గా సీనియర్‌ న్యాయవాది లిజ్‌ మాథ్యూ వ్యవహరించారు. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘ఈ పని మా కూతుళ్ల కోసమే చేస్తున్నాం. మా పిల్లలైనా, మీ పిల్లలైనా ఒకటే’అని తుషార్‌ మెహతా కోర్టుకు విన్నవించారు.

సమగ్ర నివేదిక ఇవ్వండి... 
మహిళల భద్రతకు సంబంధించి 4 కీలక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. పార్కులు, రోడ్లు, ప్రజా రవాణా వ్యవస్థలు, మార్కెట్లు, విద్యా సంస్థల వద్ద మహిళలు, పిల్లల భద్రతకు తీసుకున్న చర్యలు. లైంగిక నేరాలకు పాల్పడిన వారి వివరాలున్న జాతీయ డేటాబేస్‌ను ఢిల్లీ పోలీసులు ఏమేరకు క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నారు? లైంగిక నేరాలకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ’ఇన్వెస్టిగేషన్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌’ఆన్‌లైన్‌ టూల్‌ను ఏ మేరకు సద్వినియోగం చేస్తున్నారు?. మహిళల భద్రత, సాధికారత కోసం ఉద్దేశించిన ’మిషన్‌ శక్తి’కార్యక్రమం ఢిల్లీలో అమలవుతున్న తీరుపై పూర్తి నివేదికలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement