దీపథూన్‌ వివాదం: సుప్రీంకోర్టు కీలక అదేశాలు | Supreme Court Allows Karthigai Deepam At Thiruparankundram Hill Deepathoon On November 24, Check Out Conditions List Inside | Sakshi
Sakshi News home page

దీపథూన్‌ వివాదం: సుప్రీంకోర్టు కీలక అదేశాలు

Nov 20 2026 4:13 PM | Updated on Nov 20 2026 5:02 PM

SC allows one time Karthigai Deepam lighting at Thiruparankundram hill on Nov 24

Thiruparankundram Hill Deepathoon Row: తమిళనాడులోని మధురైలోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుప్పరంకుంద్రం కొండపై కార్తీక దీపం వెలిగించే వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక  ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 24న మధురైలోని తిరుపరంకుంద్రం కొండపై ఉన్న వివాదాస్పద 'దీపథూన్‌' (రాతి స్తంభం) వద్ద కార్తీక దీపాన్ని వెలిగించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.  అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఇది పరిమితమని దేశ అత్యున్నత న్యాయస్థానం  స్పష్టం చేసింది. అయితే, ఈ కార్యక్రమాన్ని కేవలం అధికారిక ఆలయ బృందం, ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ స్థల యాజమాన్యం, మతపరమైన ఆచారాలకు సంబంధించిన ప్రధాన వివాదంపై తుది విచారణను పెండింగ్‌లో ఉంచింది.

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ అనుమతిని కేవలం ఒక్కసారికి మాత్రమే ఇచ్చే తాత్కాలిక ఏర్పాటుగా (one-time interim arrangement) స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునకు ఆమోదంగా గానీ, లేదా అక్కడ ఒక స్థిరమైన ఆచారం ఉందనడానికి నిదర్శనంగా గానీ పరిగణించరాదని పేర్కొంది. రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలోని కొన్ని భాగాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణ 2027 జనవరి రెండో వారానికి వాయిదా  వేసింది.

ఇదీ చదవండి: రూ. 50 లక్షల జీతం వదిలి.. ఐఐఎం బెంగళూరు నుంచి సాధ్విగా, తోడుగా తల్లి

కోర్టు విధించిన ప్రధాన నిబంధనలు:

  • ఆలయ కార్యనిర్వహణాధికారి (EO), భారత పురావస్తు శాఖ (ASI), మధురై పోలీస్ కమిషనర్‌లతో సంప్రదించి జిల్లా యంత్రాంగం ఆలయ బృందం సంఖ్యను, సభ్యులను నిర్ణయిస్తుంది.

  • జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు; దీపం వెలిగించే సమయం, మార్గం మరియు వ్యవధిని ఆయనే ఖరారు చేస్తారు.

  • ఈ ప్రాంతంలో ప్రజలు గుమిగూడటం, ఊరేగింపులు, నిరసనలు ,నినాదాలు చేయడం నిషేధం. 

  • పోలీసులు భద్రతను కల్పిస్తారు. అవసరమైతే, వీలును బట్టి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సహాయం తీసుకుంటారు.

  • పురావస్తు శాఖ (ASI) పరిరక్షణ నిబంధనలను సూచిస్తుంది. ఆ ప్రాంతంలో తవ్వకాలు, నిర్మాణాలు, ఇంకా ఇతర మార్పులు చేయడం నిషేధం.

  • ఈ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో కొండపైకి ప్రవేశించే హక్కు గానీ, ఆక్రమణ లేదా నియంత్రణను గానీ క్లెయిమ్ చేయడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా అనుమతి కోరడానికి దీనిని సాకుగా చూపకూడదు.

  • అలాగే ప్రస్తుతం ఉన్న ఇతర ప్రదేశాలలో సంప్రదాయ పూజలు, దర్గా, మసీదుకు చట్టబద్ధమైన ప్రవేశం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి.

కాగా తిరుపరంకుంద్రం కొండపై హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాదుషా ఔలియా దర్గా మరియు వివాదాస్పద రాతి స్తంభం ఉన్నాయి. వీటి యాజమాన్యం, మతపరమైన స్వభావంపై ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. గురువారం జరిగిన విచారణలో, కొండ శిఖరం మొత్తం తమకే చెందుతుందని దర్గా తరఫు సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ వాదించారు. 1920 నాటి సివిల్ దావా తీర్పును ప్రస్తావిస్తూ.. దర్గాకు, రాతి స్తంభానికి మధ్య దూరం ఎంత ఉన్నప్పటికీ, శిఖరం పైన ఉన్న మసీదు, ధ్వజస్తంభం, రాతి స్తంభం ఉన్న ప్రాంతం దర్గా ఆస్తిలో భాగమేనని, అక్కడ దీపం వెలిగించే ప్రశ్నే లేదని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, వివాదాస్పద ప్రదేశంలో దీపం వెలిగించడాన్ని తమిళనాడు ప్రభుత్వం కూడా గతంలో వ్యతిరేకించింది. సర్వే స్తంభాలను మతపరమైన కట్టడాలుగా గుర్తిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన రంగు పులుముకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ (HR&CE) తన అఫిడవిట్‌లో.. 1923 సివిల్ కోర్టు డిక్రీ, 1931 ప్రివీ కౌన్సిల్ తీర్పు ప్రకారం గుర్తించిన మేరకు కొండపై అరుల్మిగుసుబ్రమణ్యస్వామి ఆలయానికి హక్కులున్నాయని తెలిపింది. అయితే, కొండను మొత్తం పురావస్తు శాఖకు అప్పగించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకించింది. సాంప్రదాయకంగా కొండ దిగువ వాలులో ఉన్న ఉచ్చిపిళ్ళయార్ ఆలయానికి సమీపంలోని 'దీప మండపం' వద్దే కార్తీక దీపం వెలిగిస్తారని, కొండ శిఖరం పైన కాదని స్పష్టం చేసింది. 1862, 1912లలో శిఖరం వద్ద దీపం వెలిగించడానికి జరిగిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. దర్గా సమీపంలో కొత్తగా దీపాలు వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.

కేసు ప్రస్థానం:
2025లో రామ రవికుమార్ అనే భక్తుడు రాతి స్తంభం (హిందూ సంఘాలు  దీనినే దీపథూన్‌గా పిలుస్తాయి) వద్ద కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి కోరగా ఆలయ అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2025 డిసెంబర్ 1న జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ ఆ స్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలని ఆదేశించారు. ఆ ఆదేశాలు అమలు కాకపోవడంతో, సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతతో వెళ్లి దీపం వెలిగించడానికి రవికుమార్ మరియు మరో పది మందికి అనుమతి ఇచ్చారు. కానీ శాంతిభద్రతల కారణాలతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 2026 జనవరి 6న హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. యాజమాన్య హక్కులు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కింద మత స్వేచ్ఛ, గత న్యాయపరమైన తీర్పుల ప్రభావం వంటి అంశాలను పరిశీలించనుంది. ఆరు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు, ఆ తర్వాత మూడు వారాల్లోగా రిజాయిండర్లు దాఖలు చేయాలని కోర్టు కక్షిదారులను ఆదేశించింది.

ఇదీ చదవండి: డెబ్యూతోనే ప్రశంసలు : ఒరాకిల్‌ నుంచి ‘తార’ గా ఎవరీ భామ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement