పండుగల వేళ ‘షుగర్‌’ షాక్‌.. కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌ | Congress Serious On BJP Govt Oevr Sugar Issue | Sakshi
Sakshi News home page

పండుగల వేళ ‘షుగర్‌’ షాక్‌.. కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌

Aug 22 2026 1:01 PM | Updated on Aug 22 2026 1:44 PM

Congress Serious On BJP Govt Oevr Sugar Issue

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ మొదలు కాకముందే దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. పెరుగుతున్న ధరలు, తక్కువగా ఉన్న చక్కెర నిల్వలు, ఇథనాల్‌ ఉత్పత్తి విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అదే సమయంలో దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరగడం, ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు మళ్లించడం వంటి అంశాలను కాంగ్రెస్‌ ప్రస్తావించింది. కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని ప్రశ్నించింది. ముఖ్యంగా పండుగల సీజన్‌కు ముందు ధరలు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పండుగల సీజన్‌ ప్రారంభానికి ముందే చక్కెర ధరలు పెరగడం, దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల చేదు.. చక్కెర తీపిలోకి కూడా చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇథనాల్‌ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి, నిల్వలు ప్రభావితమయ్యాయా? దేశంలో చక్కెర నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరాయా? ధరలు పెరుగుతున్న వేళ చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఆత్మనిర్భర్‌ భారత్‌? అంటూ కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: రేవంత్‌ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!

అయితే ఖర్గే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్‌ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్‌కు మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది దాదాపు 9 శాతానికి తగ్గిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల పెరుగుదలకు తక్కువ దేశీయ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్‌, ఊహాజనిత ట్రేడింగ్‌, నిల్వ దాచడం వంటి కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం అక్టోబర్‌ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అలాగే హోర్డింగ్‌ను అరికట్టేందుకు స్టాక్‌ పరిమితులను కూడా కఠినతరం చేసింది. మొత్తానికి పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం, దేశీయ నిల్వలు, ఇథనాల్‌ ఉత్పత్తి, దిగుమతులు.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కేంద్రం, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. పండుగల సీజన్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయన్నదే వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement