సీఎం ‘విదేశీ’ అనుమతులపై కాంగ్రెస్‌ది అనవసర రాజకీయం | BJP State President Ramchander Rao comments on Congress party | Sakshi
Sakshi News home page

సీఎం ‘విదేశీ’ అనుమతులపై కాంగ్రెస్‌ది అనవసర రాజకీయం

Aug 22 2026 12:48 AM | Updated on Aug 22 2026 12:48 AM

BJP State President Ramchander Rao comments on Congress party

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: సీఎం అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్‌ క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు హితవు పలికారు. ఈ పర్యటన నిరాకరణ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు. సీఎం ప్రతినిధి బృందానికి పెట్టుబడుల సమావేశాలకు వెళ్లేందుకు అనుమతులిచ్చినా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సీఎంలు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రొటోకాల్, డిప్లొమాటిక్‌ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. 

గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నపుడు అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్‌ ఎంపీలు, నాయకులు లేఖలు రాశారని రాంచందర్‌రావు గుర్తుచేశారు. రేవంత్‌ పెట్టిన అప్లికేషన్‌లో ఎక్కడో లోపాలు ఉండి ఉంటాయన్నారు. బీజేపీలో చేరిన ప్రముఖ కేన్సర్‌ నిపుణుడు, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్, కేన్సర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నిర్వాహకుడు విజయేందర్, ఎల్బీ నగర్‌ మేఘనా హాస్పిటల్‌ చైర్మన్‌ ప్రమోద్, ఇతర వైద్యులను రాంచందర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

నీట్‌ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్‌ విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ జోక్యం చేసుకుని విద్యార్థులకు ఫీజులు రీఫండ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement