సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనే "వికసిత్ భారత్"లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్ధం అవుతుందన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వీహెచ్ ఆరోపించారు. మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీగారి లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడ్డుతుందని విహెచ్ విమర్శించారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ నెల 25వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


