బండి సంజయ్‌కు బంపరాఫర్‌ | Bandi Sanjay Likely to Be Appointed Campaign Committee Chairman | Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌కు బంపరాఫర్‌

Oct 6 2026 3:33 PM | Updated on Oct 6 2026 4:27 PM

Bandi Sanjay Likely to Be Appointed Campaign Committee Chairman

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటూ, కేడర్‌లో నూతనోత్సాహం నింపే లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌ పగ్గాలను మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు అప్పగించేందుకు రంగం సిద్ద మవుతున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు బండి సంజయ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ శ్రేణుల్లో కన్పించిన ఉత్సాహం, అధికార పార్టీపై చేపట్టిన పోరాటాలు కేడర్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలంటే బండి సంజయ్‌ దూకుడు రాజకీయ శైలియే సరైనదనే భావనకు బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 

మరో పాదయాత్రకు రంగం సిద్ధం?
2022లో రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేశారు. దాదాపు 57అసెంబ్లీ నియోజకవర్గాలు, సుమారు 1,592 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ పాదయాత్ర ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ మొత్తం ఐదు విడతలుగా సాగింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర పార్టీని ఏవిధంగా గ్రామీణ ప్రాంతాలకు, ప్రజల్లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ఫార్ములాను మరోసారి రిపీట్ చేయాలని హైకమాండ్ యోచిస్తోంది. పార్టీ కేడర్‌లో జోష్‌ను నింపేందుకు, ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బండి సంజయ్‌తో మరో భారీ పాదయాత్ర చేయించాలనే ప్రతిపాదన ప్రస్తుతం కమలదళంలో చర్చనీయాంశమైంది.

BJP కీలక నిర్ణయం.. బండి సంజయ్‌కు బంపరాఫర్‌

దసరా ముహూర్తం.. పండగ కానుకగా ప్రకటన?
రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పరిణామాలపై దసరా పండుగ వేళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. విజయదశమి రోజున చెడుపై మంచి సాధించిన విజయంలాగే, తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీ పుంజుకునేందుకు ఈ నిర్ణయం నాంది పలకనుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మొత్తానికి, బండి సంజయ్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ హైకమాండ్ వేస్తున్న ఈ పావులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి!

ఇదీ చదవండి: డిప్రెషన్‌లోకి కన్న పేగు.. తల్లి తల్లడిల్లిపోతోంది: బండి సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement