ఎంపీడీవో మానసికంగా వేధిస్తున్నారు | MPDO is harassing me mentally | Sakshi
Sakshi News home page

ఎంపీడీవో మానసికంగా వేధిస్తున్నారు

Oct 6 2026 11:19 AM | Updated on Oct 6 2026 11:31 AM

MPDO is harassing me mentally

విలేకరులతో మాట్లాడుతున్న బాధిత మహిళా ఉద్యోగులు

జనగామ జిల్లా: ఎంపీడీవో విజయశ్రీ.. తమను నిత్యం మానసికంగా వేధిస్తూ అసభ్యకరంగా బూతులు తిడుతున్నారని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిషత్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ మయూరి, టైపిస్టు సంఘమిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద సోమవారం వారు విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. 

ఆరు నెలల క్రితం తాము సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చామని, రోజూ ఏదో ఒక అంశంపై ఎంపీడీవో తమను ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గ్రీవెన్స్‌లో అందరి ముందు దూషిస్తున్నారని, కార్యాలయంలో గతంలో పనిచేసిన సిబ్బందికి సంబంధించి పాత రికార్డులు అందుబాటులో లేవని, తమ వద్దకు వచ్చిన పెండింగ్‌ పనులు, ప్రజాపాలనకు ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వేధిస్తున్నారన్నారు. 

గత సిబ్బంది చేసిన తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయ వ్యవహారాలు ఒక అటెండర్‌ చెప్పిన విధంగా నడుస్తున్నాయని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీవో విజయశ్రీని వివరణ కోరగా తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. పనులు సకాలంలో చేయాలని, పనులు పెండింగ్‌ పెట్టవద్దని చెప్పినందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement