సాక్షి, హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన పార్కుకు, విప్రో సర్కిల్‌కు డాక్టర్ మన్మోహన్‌సింగ్ నామకరణం చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు ఆమోదం తెలిపింది.
సోమవారం స్పెషలాఫీసర్ జయేశ్‌రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో డ్రైనేజీ నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధి, కార్యాలయ భవనాలు, సాంకేతిక సేవలు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కూకట్‌పల్లి జోన్‌లో ట్రెండ్జ్ జూనియర్ నుంచి వైష్ణవి ప్రైడ్ అపార్ట్‌మెంట్ వరకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.5.95 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
దుర్గం చెరువు అభివృద్ధికి సుమారు 140 ఎకరాలు గుర్తించారు. గాజులరామారం ప్రాంతంలో రూ.5.18 కోట్లతో సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి, ఆల్విన్ కాలనీలో రోడ్డు అభివృద్ధికి రూ.2.95 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. అమీన్‌పూర్‌లో బందం కొమ్ము నుంచి లాలాబాయి కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణం, రూ.21.59 కోట్లతో చింతల్‌కుంట చెరువు పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు. మున్సిపల్ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించేందుకు టీ–వర్క్స్ ఫౌండేషన్‌తో ఏడాది పాటు సహకార ఒప్పందం కుదుర్చుకునేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్ జి.సృజన, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


