సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు కోసం పార్లమెంట్‌ను మరోసారి కొలువుదీర్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా.. పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దీంతో అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. 543 నుంచి లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినా.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత 129 స్థానాలకు గాను కొత్తగా 195కు పెరుగుతాయని, మొత్తం లోక్‌సభలో వాటి వాటా దాదాపు 24 శాతంగానే ఉంటుందని ఆయన వివరించారు.
తమిళనాట ట్విస్ట్..
ఇక తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలోనూ డీలిమిటేషన్ అంశం చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు సీఎం విజయ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది వాటా తగ్గకుండా కేంద్రం హామీ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు “దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే?” అన్న కోణంలో మాట్లాడటం చర్చకు దారితీసింది. ఈ మార్పును విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే, రాజకీయంగా ప్రశ్నిస్తోంది.
మరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాత్రం ప్రస్తుత 543 స్థానాల సంఖ్యను, తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్‌ను తాజాగా వెల్లడించారు.
ప్రత్యేక సమావేశాలపై చర్చ..
ఇక అసలు ఆసక్తి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే! వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిశాయి. అయినప్పటికీ పార్లమెంట్‌ను ఇంకా ప్రొరోగ్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక సమావేశాలకు మార్గం సిద్ధం చేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రత్యేక సమావేశాలు ఖరారయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్‌సభ స్థానాల పెంపు.. ఈ నాలుగు అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశముంది. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని చెబుతుంటే.. దక్షిణాది నేతలు మాత్రం “సంఖ్య పెరిగినా.. రాజకీయ వాటా తగ్గకూడదు” అన్న హామీ కోరుతున్నారు. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా? వస్తే డీలిమిటేషన్ బిల్లు టేబుల్‌పైకి వస్తుందా? అదే ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్‌లో అసలు ప్రశ్న!


