సాక్షి, వైఎస్సార్ జిల్లా: పబ్లిసిటీ కోసమే ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ సభ.. వైఎస్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా సాగిందని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలోనే ఇంటింటికీ తాగునీరు, ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని.. గత ప్రభుత్వంలో పూర్తయిన పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోంది’’ అని రవీంద్రనాథ్ దుయ్యబట్టారు.
‘‘వైఎస్ జగన్ హయాంలో 5 నియోజకవర్గాల్లో నీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రొద్దుటూరు మైలవరం రిజర్వాయర్ తాగునీటి ప్రాజెక్టులో 90 శాతానికి పైగా పనులు వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ప్రొద్దుటూరు తాగునీటి ప్రాజెక్ట్ టెస్ట్ ట్రయల్స్ 2022లోనే విజయవంతం. 2022లోనే టెస్ట్ ట్రయల్స్ పూర్తయినట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది’’ అని రవీంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు.
‘‘ఉద్దానంలో రూ.700 కోట్లతో కిడ్నీ బాధితులకు సురక్షిత తాగునీటి శాశ్వత పరిష్కారం లభించిందన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. వైఎస్ జగన్ ప్రభుత్వం 95.44 లక్షల ఇళ్లకు తాగునీటి వసతుల కల్పనకు చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత ఇసుక పేరుతో కృష్ణా నదిని దోచుకుంటున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇసుక ట్రాక్టర్, టిప్పర్ ధరలు రూ.6 వేల నుంచి రూ.28 వేల వరకు పెరిగాయన్నారు.
28 నెలల్లో ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం.. ఇంటింటికీ మద్యం చేరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రూ.11 వేల కోట్ల టెండర్లు రద్దు చేసి కమీషన్ల కోసం రీ-టెండర్లు పిలిచారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభలు నిర్వహిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాడు గెలిచింది బాబు కాదు.. జగనే


