పల్లెల్లో మళ్లీ రక్తపు మరకలు.. | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మళ్లీ రక్తపు మరకలు..

Nov 24 2026 1:36 AM | Updated on Nov 24 2026 1:36 AM

మూడు విడతల పోలింగ్‌ అయినా ప్రశాంతంగా జరిగేనా?

● ముగిసిన నామినేషన్ల ఘట్టం.. 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు విడతల పోలింగ్‌

● సర్పంచ్‌ గిరి కోసం పచ్చ గూండాల బరితెగింపు.. ప్రశాంత పల్లెల్లో మళ్లీ ఫ్యాక్షన్‌ బీజాలు!

● మున్సిపల్‌, జెడ్పీటీసీ ఎన్నికల తరహాలోనే దౌర్జన్యకాండ.. సీసీ కెమెరాల సాక్షిగా అక్రమాలు

● అధికార పక్షానికి దాసోహమన్న ఖాకీలు, ఐఏఎస్‌లు.. కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్‌!

● పోలింగ్‌ వేళ ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరు? యంత్రాంగంలో అంతర్మథనం

చింతకొమ్మదిన్నె/చక్రాయపేట/వేంపల్లె: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. అయితే, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన క్షణం నుంచి ముగిసే వరకు వెఎస్సార్‌ కడప జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్య వాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సర్పంచ్‌ పదవుల కోసం అధికార కూటమి నేతలు ప్రదర్శించిన అధికార దర్పం, పోలీసుల ఏకపక్ష వైఖరితో దశాబ్దాల క్రితం సద్దుమణిగిన ఫ్యాక్షన్‌ భూతం పల్లెల్లో మళ్లీ పడగవిప్పే ప్రమాదం పొంచి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నామినేషన్ల ఘట్టం నుంచే దౌర్జన్యాలు..

గత పాతిక, ముప్పై ఏళ్ల క్రితం రాయలసీమ పల్లెల్లో ఫ్యాక్షన్‌ విషనాగు బుసలు కొడుతుంటే, నాటి పోలీసుల ఉక్కుపాదం కింద అది పాతాళానికి కూరుకుపోయింది. ఆ తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగినా.. గ్రామాల్లో ఎవరి అభిమాన పార్టీకి వారు మద్దతు ఇచ్చి, ఎన్నికలు ముగియగానే శత్రువుల ఇళ్లతోనూ బంధుత్వాలు కలుపుకుంటూ ప్రశాంత జీవనం సాగించారు. కానీ, నేడు అధికార పార్టీ ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం పేరుతో ప్రశాంత పల్లెల్లో మళ్లీ కక్షల కుంపటి రాజేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దారికాచి దాడులు:

గ్రామాలలో ప్రజాబలం లేదనే భయంతో ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా మార్గమధ్యలోనే అడ్డుకుని భౌతిక దాడులకు తెగబడ్డారు. నామినేషన్‌ పత్రాలను లాక్కొని చింపేయడం,రాళ్లు, మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులతో భయాందోళనలు సృష్టించడం పరిపాటిగా మారింది.

పరిశీలనలోనూ ఒత్తిళ్లు

ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పత్రా లను పరిశీలనలో తిరస్కరించేలా చేసి, ఏకగ్రీవాలు సాధించేందుకు అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారనే విమర్శలున్నాయి.

‘కూటమి’ మార్కు అప్రజాస్వామ్యం..

ఇటీవల జరిగిన మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నాటి అరాచకాలే పంచాయతీ ఎన్నికల్లో నూ పునరావృతమయ్యాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో పోలీసులు ముందస్తు పథకం ప్రకారం ప్రతిపక్ష నాయకులను ఇళ్లలోనే అదుపులోకి తీసుకోవడం, పోలింగ్‌ ఏజెంట్లను బయటకు నెట్టివేయడం, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ నిఘా కళ్లు తెరిచే ఉన్నా వాటి ముందే మాస్‌ రిగ్గింగ్‌, దొంగ ఓట్లకు పాల్పడటం వంటి ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ప్రజలు మండిపడ్డారు.

సామాన్యుల ప్రాణాలు బలి!

అధికార పార్టీ నేతలకు తలొగ్గిన పోలీసు శాఖ, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సంబంధం లేకపోయినా నాన్‌బెయిలబుల్‌ కేసులు, బైండోవర్ల పేరుతో వేధిస్తుండటంతో.. కొందరు కార్యకర్తలు రాత్రివేళల్లో ఇళ్లలో ఉండలేక కొండలు, గుట్టల్లో తలదాచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు అధికార పక్షం ఎన్ని అరాచకాలు చేసినా కేసులు పెట్టకపోవడం, కోర్టు ఆదేశాలతో పెట్టాల్సి వస్తే నామమాత్రపు సెక్షన్లు వేసి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అధికార నేతల పంతాలకు సామాన్య కార్యకర్తల ప్రాణాలు సైతం బలవుతున్నాయి. ఇందుకు చక్రాయపేట మండలం నాగలగుట్టపల్లెలో జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతే నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.

కళ్లు మూసుకున్న ఐఏఎస్‌లు..

ఎన్నికల అరాచకాలను మీడియా కళ్లముందు సినిమా లా చూపుతున్నా, జాతీయ స్థాయిలో చర్చలు జరుగు తున్నా.. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన ఐఏఎస్‌ అధికారులు మాత్రం ‘అంతా బాగుంది..’ అంటూ అధికార పార్టీకి దాసోహం అంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నామినేషన్‌ కేంద్రాల వద్ద రౌడీ మూకలు చెలరేగిపోతుంటే నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని నిజాయతీ కలిగిన కిందిస్థాయి పోలీసులు అంతర్మథనం చెందుతున్నారు.

పాలకులు, అధికారుల ఏకపక్ష దుశ్చర్యలకు విసిగిపోయిన జనం లోలోపల కోపంతో రగిలిపోతున్నారు. ‘మాకూ అవకాశం వస్తుంది.. అప్పుడు రెండింతలు చూపుతాం’ అంటూ పెంచుకుంటున్న కక్షలు ముదిరి మళ్లీ ఫ్యాక్షన్‌గా మారే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో ఏదైనా ప్రాణనష్టం జరిగితే నాయకులు తప్పించుకుంటారు కానీ, అధికార యంత్రాంగమే న్యాయస్థానం ముందు తలవంచి సమాధానం చెప్పాల్సి ఉంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. నామినేషన్ల పర్వంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో.. కనీసం నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో జరగనున్న మూడు విడతల పోలింగ్‌నైనా ఎన్నికల కమిషన్‌, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజల ఓటు హక్కును కాపాడాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement