● ఓట్లేయకుండానే మున్సిపల్
పాలకవర్గం ఏర్పాటు
● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పరిధిలోని 1,30,000 మంది ఓటర్లు ఓటు వేయకుండానే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌తోపాటు 52 మంది కౌన్సిలర్లతో పాలకవర్గం ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ పాలకవర్గం కొలువుదీరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో దొరసానిపల్లెలో ని తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజాద్రోహం దినం’ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు నల్ల కండువాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ సాధారణంగా ఓటు వేస్తేనే మనిషి బతికి ఉన్నట్టు అని పల్లెల్లో సామెత ఉందని, ఆ ప్రకారం ఓట్లు వేయలేదంటే ఓటర్లు మరణించిన వారితో సమానమేనన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తన సోదరుడు రాఘవరెడ్డి కోసం ప్రజలకు ఓటు వేసే అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఓటేలేని రాఘవరెడ్డిని తెచ్చి చైర్మన్‌ను చేశారన్నారు. 120 ఏళ్ల మున్సిపల్ చరిత్రలో ఇంతటి దుర్మార్గమైన చర్య ఎప్పుడూ జరగలేదన్నారు. మరోవైపు నామినేషన్లకు తాము అడ్డు చెప్పడం లేదని ఎమ్మెల్యే చాగంటిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇలానే చేశారని తెలిపారు. భవిష్యత్తులో తమకు మంచి రోజులు వస్తాయని.. పోరెడ్డి నరసింహారెడ్డి చైర్మన్‌గా, ఇదే 52 మంది కౌన్సిలర్ అభ్యర్థులను మళ్లీ కౌన్సిలర్లుగా చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దొడ్డిదారిన పీఠం ఎక్కిన వారందరిని దించేస్తామని పునరుద్ఘాటించారు. అధికార పార్టీ నేతల మాటలకు తలొగ్గి నామినేషన్ పత్రాలను సైతం డిస్‌క్వాలిఫై చేసిన అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. తాజా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించడానికి హైకోర్టును ఆశ్రయించామన్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో తమ అభ్యర్థులచే నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ఈ పంచాయతీని ఏకగ్రీవం చేసి ఇస్తామని నంద్యాల కొండారెడ్డి ఆ పార్టీ అభ్యర్థులచే రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కొన్ని నామినేషన్లు తమ అభ్యర్థులతో వేయించినందుకు పర్లపాడు మహేశ్వరరెడ్డి డీఎస్పీని దూషించారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్‌సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జేష్టాది శారద, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజాపీర్, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు చౌడం రవి, ఉప్పర మురళి, మాజీ కౌన్సిలర్లు పిట్టా భద్రమ్మ, లావణ్య, రాగుల శాంతి, గరిశపాటి లక్ష్మీదేవి, ఎద్దుల జయంతి, పాతకోట మునివంశీధర్‌రెడ్డి, టప్పా గైబుసాహెబ్, శౌరి సుభాష్‌రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ యెల్లాల కుమార్‌రెడ్డి, బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోనా ప్రభాకర్‌రెడ్డి, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంభం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


