విశాఖ: మంత్రి నారా లోకేశ్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. పెట్టుబడుల గురించి నారా లోకేశ్ అనేక మాటలు మాట్లాడుతున్న వేళ దీనిపై విశాఖలో గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ పెట్టుబడులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. మా హయాంలో వచ్చిన పరిశ్రమలపై నేను ఆధారాలతో పాటు నిరూపిస్తాను. మీ హయాంలో వచ్చిన పెట్టుబడులపై ఎంవోయూలు బయట పెట్టగలరా? డేటా చోరీ వ్యవహారం ఇటీవల రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న కంపెనీల నేపథ్యంలో మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోగలం.
రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, పడిపోతున్న విద్యుత్ డిమాండ్, పన్నుల వసూలులో వృద్ధి లేకపోవడం మీరు చెబుతున్న మాటలు అబద్ధమని బట్టబయలు చేస్తున్నాయి. మీ హయాంలో విద్యుత్ విక్రయాలు విద్యుత్ సరఫరా రెండూ తగ్గిపోయాయి. దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది’’ అని తెలిపారు.


